న్యూఢిల్లీ, జూలై 5: బీజేపీ పాలిత హర్యానాలో శనివారం జరిగిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)లో పెద్దయెత్తున అక్రమాలు జరిగాయని, దీనిని రద్దు చేసి తిరిగి నిర్వహించాలని కాంగ్రెస్ ఎంపీ రణదీప్ సింగ్ సూర్జేవాలా డిమాండ్ చేశారు. ఈ నెల 4న 238 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన లెవెల్-3 పరీక్షలో పలు అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు.
పరీక్ష ప్రశ్న పత్రం ముందే లీకై ఉంటుందన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. ప్రశ్న పత్రాలున్న ప్యాకెట్ల సీల్స్ బద్దలుకొట్టి ఉన్నాయని, సరిపోలని ఓఎంఆర్ షీట్లు ఇచ్చారని, ముద్రణ, అక్షర దోషాలున్నాయని రణదీప్ సింగ్ ఆరోపించారు. చాలామంది అభ్యర్థులకు వేరే రోల్ నంబర్ ఉన్న ఓఎంఆర్ షీట్లను ఇచ్చారని, ఇంగ్లిష్ పీజీటీ పరీక్షకు హాజరైన కొందరు అభ్యర్థులకు ఎకనమిక్స్ ప్రశ్న పత్రం ఇచ్చారని రణదీప్ సింగ్ ఆరోపించారు.