Jairam Ramesh | న్యూఢిల్లీ: భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణకు తానే కారణమంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ అంశంపై చర్చించేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయాలని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం పలు దేశాలకు దౌత్య బృందాలను పంపడం ప్రజల దృష్టిని మరల్చే విన్యాసాల్లో భాగమని విమర్శించింది. ప్రధాని మోదీ బహిరంగ సభల్లో భారీ డొల్ల సినిమా డైలాగులు చెప్పడం కాదని.. ఓ తీవ్రమైన అంశానికి సంబంధించి తాము అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.
‘పహల్గాంలో కిరాతక హత్యలకు పాల్పడిన హంతకులు ఇంకా స్వేచ్ఛగా ఎందుకు తిరుగుతున్నారు? గత ఏడాదిన్నర కాలంలో పూంచ్, గగన్‌గిర్, గుల్మార్గ్లో జరిగిన ఉగ్ర దాడులకు కూడా వారే కారణమని కొన్ని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ అంశంపై మీరు (ప్రధాని) అఖిలపక్ష సమావేశం ఎందుకు ఏర్పాటు చేయలేదు, ప్రతిపక్ష పార్టీలను విశ్వాసంలోకి ఎందుకు తీసుకోవడం లేదు?’ అని నిలదీశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను పాకిస్థాన్ వెంటనే ఖాళీ చేయాలని కోరుతూ 1994 ఫిబ్రవరి 22న పార్లమెంట్ ఉభయసభలు ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించాయని గుర్తు చేశారు.
ఆపరేషన్ సిందూర్ సమయంలో చైనా, పాకిస్థాన్ మధ్య అనుబంధం స్పష్టంగా వెల్లడైన నేపథ్యంలో ఆ తీర్మానాన్ని పునరుద్ఘాటించేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. భారత్, పాక్ మధ్య యుద్ధాన్ని ఆపింది తామేనంటూ రెండు వారాలుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఆ దేశ విదేశాంగ మంత్రి రూబియో పదేపదే ప్రకటనలు చేస్తున్నా మోదీ మొండిగా మౌనం వహించడానికి కారణమేమిటని నిలదీశారు. వాణిజ్య ఒప్పందంపై వాగ్దానం ద్వారా తానే భారత్, పాక్ మధ్య సైనిక ఘర్షణను నివారించానని ట్రంప్ అనేకమార్లు చెప్పుకున్నారని, కానీ ఇంతవరకు ప్రధాని మోదీ ఆ ప్రకటనలను తిరస్కరించలేదని అన్నారు.
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఒక అడుగు ముందుకేసి, భారత్-పాక్ మధ్య చర్చలు తటస్థ వేదికపై జరుగుతాయని చెప్పారని, దీనిపై మన విదేశాంగ మంత్రి కూడా స్పందించడం లేదని విమర్శించారు. ‘ఈ భీకరమైన నిశ్శబ్దం ఎందుకు?’ అని ఆయన వాపోయారు. ఆపరేషన్ సిందూర్‌ను అనూహ్యంగా, ఆకస్మికంగా నిలిపివేయడంపైనే కాకుండా దాని ప్రభావంపై తీవ్రమైన ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయని జైరాం రమేశ్ చెప్పారు. దీనికి కార్గిల్ తరహా కమిటీ వేయడమే పరిష్కారమని సూచించారు. కార్గిల్ యుద్ధం ముగిసిన మూడు రోజుల అనంతరం నాటి వాజపేయి ప్రభుత్వం 1999, జూలై 29న ఓ రివ్యూ కమిటీ వేసిందని తెలిపారు. ఆ కమిటీ ఇచ్చిన నివేదికను 2000, ఫిబ్రవరి 23న పార్లమెంట్లో ప్రవేశపెట్టారని గుర్తుచేశారు.