Punjab Polls: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్ధిగా చెప్పుకుంటున్న పార్టీ రాష్ట్ర శాఖ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పంజాబ్లో సీఎం అభ్యర్ధి పేరును ప్రకటించరాదని కాంగ్రెస్ అగ్ర నాయకత్వం నిర్ణయించింది. అసెంబ్లీ ఎన్నికలను సమిష్టి నాయకత్వంతో ఎదుర్కోవాలని పార్టీ హైకమాండ్ పంజాబ్ పార్టీ రాష్ట్ర శాఖకు స్పష్టం చేసింది.
పంజాబ్లోని వివిధ వర్గాల మధ్య సమతూకం పాటించే దిశగా హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకుందని భావిస్తున్నారు. సిద్ధూ జాట్ నేతగా, సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ దళిత నేతగా, సునీల్ జాఖడ్ హిందూ నేతగా ఆయా వర్గాల ప్రజలను ఆకట్టుకోగలరని పార్టీ నాయకత్వం భావిస్తోంంది. మరోవైపు చరణ్జిత్ సింగ్ జన్నీని సీఎంగా అధిష్టానం ప్రమోట్ చేయడం రుచించని సిద్ధూ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాను సీఎం అభ్యర్ధి అవుతానని భావించారు.
సిద్ధూ పలు సభల్లో తనను కాంగ్రెస్ సీఎం అభ్యర్ధిగా పరోక్షంగా ప్రచారం చేసుకుంటున్నారని, సమిష్టిగా ఎన్నికల్లో పోరాడేందుకు ఇది అవరోధంగా ఉంటోందని సీనియర్ కాంగ్రెస్ నేతలు వాపోతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్ధుల పేర్లను సిద్ధూ స్వయంగా ప్రకటిస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ రకంగా టికెట్లను కేటాయిస్తుంటే ఇక ఎన్నికల కమిటీలను ఎందుకు ఏర్పాటు చేస్తున్నారని వారు ప్రశ్నిస్తున్నారు.