Donald Trump – Congress | అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌ను కాంగ్రెస్ పార్టీ అభినందనలు తెలిపింది.‘ప్రపంచ శాంతి, శ్రేయస్సు కోసం అమెరికాతో కలిసి ముందుకు సాగేందుకు ఎదురు చూస్తున్నాం’ అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బుధవారం పేర్కొన్నారు. లోక్‌సభలో విపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ.. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్‌కు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టనున్న ట్రంప్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైన డెమోక్రటిక్ పార్టీ నేత కమలా హ్యారిస్ భవిష్యత్ ఉజ్వలంగా ఉండాలని పేర్కొన్నారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్.. దేశ అధ్యక్ష ఎన్నికల్లో తన డెమోక్రటిక్ పార్టీ ప్రత్యర్థి కమలా హ్యారిస్ పై విజయం దిశగా అడుగులేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికతో అమెరికా-భారత్ మధ్య అంతర్జాతీయంగా బలమైన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం అవుతుంది. దీర్ఘకాలికంగా ప్రజాతంత్ర విలువలు, ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయి’ అని మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు.