కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రధాని నరేంద్ర మోదీ పాలనపై తీవ్రంగా ధ్వజమెత్తారు. ద్వేషం, అసహనం, మతోన్మాదం దేశాన్ని చుట్టుముట్టాయని ఆరోపించారు. వీటిని అరికట్టకపోతే సమాజం అధఃపాతాళికి పడిపోవడం ఖాయమని దుయ్యబట్టారు. ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రికలో కాంగ్రెస్ అధ్యక్షురాలు వ్యాసం రాస్తూ… మోదీ పాలనపై విరుచుకుపడ్డారు. ఇక వీటిని కొనసాగించడానికి ఏమాత్రం ప్రజలు అంగీకరించవద్దని ఆమె కోరింది.
తామెంతో కష్టపడి నిర్మించిన దేశాన్ని, ఇప్పటి ప్రభుత్వం నాశనం చేస్తోందని, ఈ ఉన్మాదాలు దేశాన్ని సర్వనాశనం చేస్తున్నాయని అన్నారు. ఇలాంటి వాతావరణాన్నే ప్రజలు కోరుకుంటున్నారా? అంటూ ప్రశ్నించారు. ఇలాంటి వాతావరణం ఉంటేనే కరెక్ట్.. అనే వాతావరణాన్ని కేంద్ర ప్రభుత్వం సృష్టిస్తోందని దుయ్యబట్టారు.
ధరించే దుస్తులు, తినే ఆహారం, జరుపుకునే పండగలు.. ఇలా ఏది తీసుకున్నా… ఏదో ఒకవిధమైన అలజడి మాత్రం జరుగుతోందని, భారతీయులే భారతీయులను వేధించేలా, ప్రశ్నించేలా పరిస్థితులు తయారు చేస్తున్నారని, ఇలాంటి పరిస్థితులను సృష్టించే వారికి కూడా ప్రత్యక్ష, పరోక్ష సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి అందుతున్నాయని ఆరోపించారు.
దేశ యువతను, దేశంలోని వనరులను దేశాభివృద్ధికే వాడాలని, కానీ… ద్వేషం, అసహనం.. లాంటి వాటికి వాడేసి, భవిష్యత్తును నాశనం చేస్తున్నారంటూ సోనియా మండిపడ్డారు. దేశంలోని వైవిధ్యతను తీసుకోవడంపై ప్రధాని నుంచి మొదలు.. అందరూ చర్చలు జరుపుతున్నారని, అందరూ కలిసి కట్టుగా ఉండడానికి ఉపయోగపడిన వైవిధ్యత.. ఇప్పుడు సమాజాన్ని చీల్చడానికి వాడుతున్నారని సోనియా ఆ వ్యాసంలో మండిపడ్డారు.