బెంగళూరు, నవంబర్ 4: కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో ముసలం కొనసాగుతున్నది. సీఎం సీటుపై ఇప్పటికే డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కన్నేయగా, తాజాగా మరికొంత మంది రేసులోకి వచ్చారు. తాము కూడా సీఎం సీటును ఆశిస్తున్నట్టు ప్రకటనలు చేయడం సంచలనంగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో పరిస్థితి ఎక్కడ ‘చేయి’ దాటిపొతుందనే భయాందోళనతో తాజాగా సీఎం సిద్ధరామయ్య శనివారం మంత్రులతో అల్పాహార భేటీ నిర్వహించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకొన్నది. ఈ భేటీకి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సహా పలువురు మంత్రులు హాజరు కాగా, ఇద్దరు మంత్రులు గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది.
సిద్ధరామయ్య బెంగళూరులో ఏర్పాటు చేసిన ఈ బ్రేక్ఫాస్ట్ మీటింగ్కు సీనియర్ మంత్రి సతీశ్ జార్కిహోళి, మరో మంత్రి శరణ్ ప్రకాశ్ పాటిల్ హాజరు కాలేదు. దీంతో కాంగ్రెస్లో నెలకొన్న అసంతృప్తి, నేతల మధ్య నెలకొన్న విభేదాలపై ఊహాగానాలు మరింత ఊపందుకొన్నాయి. పార్టీలో అంతర్గతంగా కుమ్ములాటలు తీవ్రస్థాయిలో ఉన్నాయని, మంత్రుల మధ్య సఖ్యత లేదని, మంత్రులు, నేతలు రెండు వర్గాలు చీలిపోయారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
అల్పాహార భేటీకి గైర్హాజరు కావడంపై మంత్రులు సతీశ్ జార్కిహోళి, శరణ్ ప్రకాశ్ పాటిల్ పలు కారణాలు చెప్పుకొచ్చారు. తనకు గత 3-4 రోజులుగా ఆరోగ్యం బాగాలేదని, దీని కారణంగా సమావేశానికి హాజరుకాలేకపోయానని సతీశ్ జార్కిహోళి పేర్కొన్నారు. తనకు ఆరోగ్యం ముందు.. తర్వాతే రాజకీయాలు అని, అందుకే సమావేశానికి ఆహ్వానం అందినా వెళ్లలేదని చెప్పారు. అక్కడ సమావేశంలో ఏం జరిగిందో తనకు తెలియదని, ఆదివారం బెంగళూరు వెళ్లిన తర్వాత వివరాలు తెలుసుకొంటానని తెలిపారు. మరోవైపు తనకు ఆహ్వానం అందలేదని, తాను బెళగావి పర్యటనలో ఉన్నానని వైద్య మంత్రి శరణ్ ప్రకాశ్ పాటిల్ పేర్కొన్నారు. కాంగ్రెస్లో భిన్నాప్రాయాలు ఏమీ లేవని పేర్కొన్న ఆయన.. సీఎంగా సిద్ధరామయ్య కొనసాగుతారా? అన్న ప్రశ్నపై స్పందించేందుకు మాత్రం నిరాకరించారు.