బెంగళూరు, సెప్టెంబర్ 11: కర్ణాటక వాల్మీకి కార్పొరేషన్ స్కామ్‌లో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. గిరిజనుల సంక్షేమం కోసం ఉపయోగించాల్సిన నిధులతో తెలంగాణ కాంగ్రెస్ కోసం మద్యం కొనుగోళ్లు జరిగాయని తెలుస్తున్నది. ఎన్నికల ప్రచారానికీ ఈ నిధులను వినియోగించినట్టు సమాచారం.
ఈ మేరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మంగళవారం ప్రజాప్రతినిధుల కోర్టులో దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో కీలక అంశాలు ఉన్నట్టు ఓ జాతీయ మీడియా సంస్థ కథనం ప్రచురించింది. దీని ప్రకారం.. కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ కీలక నేత బీ నాగేంద్ర వ్యక్తిగత సహాయకుడు విజయ్ కుమార్ గౌడ మొబైల్ ఫోన్లో దొరికిన ఆధారాలతో ఈ బండారం బయటపడింది.
కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ నుంచి దారి మళ్లించిన డబ్బుల్లో దాదాపు రూ.20 కోట్లు తెలంగాణకు వచ్చాయి. ఈ డబ్బులతో లోక్‌సభ ఎన్నికల సమయంలో తెలంగాణలో మద్యం కొనుగోళ్లు జరిగాయి. ఎన్నికల ప్రచారానికీ ఈ డబ్బులను వినియోగించారు. ఈ స్కామ్‌లో హైదరాబాద్‌కు చెందిన బిల్డర్ సత్యనారాయణ వర్మ కీలకంగా వ్యవహరించారు. కాగా, సత్యనారాయణ వర్మకు తెలంగాణకు చెందిన ఇద్దరు కాంగ్రెస్ కీలక నేతలు సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతున్నది.
ఈడీ చేతికి పక్కా ఆధారాలు
వాల్మీకి కార్పొరేషన్ స్కామ్‌ను కర్ణాటక ప్రభుత్వం సిట్ ద్వారా విచారించింది. ఈ స్కామ్‌లో మాజీ మంత్రి బీ నాగేంద్ర పాత్రనే లేదని సిట్ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. అయితే, ఇదే కేసును దర్యాప్తు చేసిన ఈడీ మాత్రం ఈ కుంభకోణంలో అసలు విషయాలను బయటపెట్టింది. ఈ మేరకు 5,114 పేజీల చార్జిషీట్‌ను దాఖలు చేసింది. ఇందులో 15 మంది సాక్షుల స్టేట్మెంట్లను సైతం పొందుపరిచింది. నాగేంద్ర, సత్యనారాయణ వర్మతో పాటు తెలంగాణకు చెందిన ఇటకరి సత్యనారాయణ, కార్పొరేషన్ మాజీ ఎండీ జేజీ పద్మనాభ సహా 20 మంది పేర్లను చార్జిషీట్లో ప్రస్తావించింది.