పాట్నా: బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఘర్షణ పడ్డారు. పార్టీ జెండాలతో బీహార్(Bihar)లోని పాట్నాలో ఒకర్ని ఒకరు కొట్టుకున్నారు. నిరసన ర్యాలీ భారీ విధ్వంసానికి దారి తీసింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇటీవల ఓట్ అధికార్ యాత్ర నిర్వహించారు. ఆ ర్యాలీలో ఓ వ్యక్తి ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీనికి నిరసన ఇవాళ బీజేపీ ర్యాలీ చేపట్టింది. అయితే ర్యాలీని అడ్డుకునేందుకు కాంగ్రెస్ నేతలు కూడా ర్యాలీ నిర్వహించారు. ఆ రెండు పార్టీలకు చెందిన నేతలు ఎదురుపడిన సమయంలో.. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
#WATCH | Patna, Bihar: BJP and Congress workers clash as the former staged a protest against the latter in front of the Congress office. pic.twitter.com/GDUxM0JgyB
— ANI (@ANI) August 29, 2025
భారీ సంఖ్యలో కార్యకర్తలు పార్టీ జెండాలు ఉన్న కర్రలతో దాడి చేసుకున్నారు. ఓ దశలో కాంగ్రెస్ కార్యాలయం వద్ద కూడా దాడి జరిగింది. కాంగ్రెస్‌కు గట్టి బదులిస్తామని బీజేపీ నేత నితిన్ నాబిన్ అన్నారు. తల్లిని దూషించిన కాంగ్రెస్ పార్టీకి బీహారీలు గుణపాఠం చెబుతారని అన్నారు. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ఆయన అన్నారు. నితీశ్ కుమార్ పాలన సరిగా లేదని, ఇదంతా ప్రభుత్వ జోక్యంతోనే జరుగుతోందని కాంగ్రెస్ నేత డాక్టర్ ఆశుతోష్ ఆరోపించారు.
రఫీక్ అరెస్ట్
దర్బంగా జిల్లాలో జరిగిన ర్యాలీలో రఫీక్ అలియాస్ రాజా అనే వ్యక్తి అకస్మాత్తుగా మైక్‌ను అందుకుని ప్రధాని మోదీతో పాటు ఆయన తల్లిపై దుర్భాషలాడాడు. రఫీక్ అలియాస్ను భోపురా గ్రామస్థుడిగా గుర్తించారు. సిమ్రి పోలీసు స్టేషన్లో అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బితౌలీ వద్ద ర్యాలీ జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. చాలా తీవ్రమైన పదజాలంతో మోదీ, ఆయన తల్లిని తిట్టాడు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి అనుకూలంగా ఆ వ్యక్తి నినాదాలు చేశాడు. ప్రధాని మోదీపై దుర్భాషలాడిన వ్యక్తి రఫీక్ ను పోలీసులు అరెస్టు చేశారు.