గోవా ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ముందే అలర్ట్ అయ్యింది. అన్ని పార్టీల కంటే ముందే తన అభ్యర్థులను ప్రకటించి, విపక్షాలకు సవాల్ విసిరింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం 8 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను గురువారం విడుదల చేసింది. ఎన్నికల అధికారి, సీనియర్ నేత ముకుల్ వాస్నిక్ పేరుతో ఈ లేఖ విడుదలైంది. అందులో మాజీ సీఎం దిగంబర్ కామత్ పేరు కూడా ఉంది. మార్గో అసెంబ్లీ సీటు నుంచి ఆయన ఈ సారి బరిలోకి దిగుతున్నారు. సుధీర్ కనోల్కర్, టోనీ రాడ్రిగస్, రాజేశ్ వెరన్కర్, సంకల్ప్ ఆమోన్కర్, ఎలెక్సో రెగినాల్డో లారెన్సో, దిగంబర్ వసంత్ కామత్, యూరీ అలెమో, ఆల్టోన్ డీకోస్టా పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.
గోవాలో ప్రస్తుతం బీజేపీ సర్కార్ నడుస్తోంది. మనోహర్ పర్రీక్కర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బీజేపీకి ఇది కంచుకోట. ఆయన మరణించిన తర్వాత అక్కడ బీజేపీకి కష్టాలు ప్రారంభమయ్యాయి. దీంతో జాతీయగా పార్టీగా తమకే తదుపరి అధికారం దక్కుతుందని కాంగ్రెస్ వ్యూహాలు పన్నుతోంది. ఈ సమయంలో హఠాత్తుగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గోవాపై కన్నేశారు. ఎలాగైనా టీఎంసీని అధికారంలోకి తేవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీంతో కాంగ్రెస్ అలర్ట్ అయ్యింది. అందరి కంటే ముందుగానే అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసింది.