భువనేశ్వర్: సీనియర్ ఐఏఎస్ అధికారి అవినీతిపై కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఆయన ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. అయితే ఒక్కసారిగా తేనెటీగలు వారిపై దాడి చేశాయి. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలతోపాటు పోలీసులు వాటి బారి నుంచి తప్పించుకునేందుకు ఇబ్బందులుపడ్డారు. (Bees attack) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ఈ సంఘటన జరిగింది. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీల సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బిష్ణుపాద సేథి పది లక్షలు లంచం తీసుకున్న అవినీతి కేసుపై సీబీఐ దర్యాప్తు చేస్తున్నది. ఈ నేపథ్యంలో సోమవారం యువజన కాంగ్రెస్ కార్యకర్తలు భువనేశ్వర్‌లోని సేథి నివాసం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఆయన ఇంటిని చుట్టుముట్టేందుకు ప్రయత్నించారు.
కాగా, ఒక్కసారిగా తేనెటీగలు వారిపై దాడి చేశాయి. దీంతో తమను తాము రక్షించుకునేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు పరుగులు తీశారు. నిరసన కోసం తెచ్చిన బ్యానర్లను కొందరు కప్పుకున్నారు. భద్రత కోసం మోహరించిన పోలీసులు, కవర్ చేస్తున్న జర్నలిస్టులు కూడా తేనెటీగల దాడిని ఎదుర్కొన్నారు. ముఖాలను కప్పుకునేందుకు ప్రయత్నించారు.
మరోవైపు కొంతసేపటి తర్వాత తేనెటీగలు వెళ్లిపోవడంతో యువజన కాంగ్రెస్ కార్యకర్తలు తమ నిరసనను తిరిగి కొనసాగించారు. ఐఏఎస్ అధికారి ఇంటిపై కోడిగుడ్లు, టమోటాలు విసిరారు. సేథీ నివాసం వద్దకు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారితో ఘర్షణకు దిగారు. పలువురు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే తేనెటీగల దాడికి సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Bee-ware of protests! Congress workers in #Bhubaneswar attacked by swarm of bees 🐝#Odisha #congresskelaggaye pic.twitter.com/ad793gLIUi
— Amit Sahu🇮🇳 (@amitsahujourno) December 16, 2024