పనాజీ, జూలై 10: గోవాలో బీజేపీ కుట్ర రాజకీయాలు పాల్పడుతున్నది. అధికారంలో ఉన్నప్పటికీ ప్రతిపక్ష కాంగ్రెస్‌లో గందరగోళం సృష్టించేందుకు పావులు కదుపుతున్నది. కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే దిగంబర్ కామత్ పార్టీపై తిరుగుబాటు జెండా ఎగుర వేసేలా చేసింది. ఆరు నుంచి 10 మంది ఎమ్మెల్యేలు మార్గావోలోని ఓ హోటల్లో క్యాంపు ఏర్పాటు చేశారని ప్రచారం జరుగుతున్నది. వీరంతా బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని చెబుతు న్నారు. 40 మంది సభ్యులున్న గోవా అసెంబ్లీలో కాంగ్రెస్ తరఫున 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇద్దరు ఎంజీపీ, ముగ్గురు స్వతంత్రుల మద్దతుతో 20 సీట్లు గెలిచిన బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
లోబోపై వేటు
ఎమ్మెల్యేలంతా ఎక్కడికీ వెళ్లలేదని, బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తున్నదని కాంగ్రెస్ చెబు తూ వచ్చింది. అయితే 11 మంది ఎమ్మెల్యేలలో ఐదుగురు కాంటాక్ట్‌లో లేకుండాపోయారని సాయంత్రానికి తెలిపిం ది. ప్రతిపక్ష నేత హోదా నుంచి మైఖేల్ లోబోను గోవా కాంగ్రెస్ ఇన్చార్జి దినేశ్ గుండూరావు తొలగించారు. కాగా, దిగంబర్ కామత్, మైఖేల్ లోబోలు బీజేపీతో లాలూచీ పడి కాంగ్రెస్‌పై కుట్ర పన్నుతున్నారని దినేశ్ వ్యాఖ్యానించడం గమనార్హం.
బీజేపీలో చేరను..
అయితే తాను బీజేపీలో చేరబోనని కాంగ్రెస్ ఎమ్మెల్యే మైఖేల్ లోబో స్పష్టం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు మైఖేల్ లోబో బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా, మూడేండ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. కాగా, గోవా పరిణామాల దృష్ట్యా కాంగ్రెస్ సీనియర్ నేత ముకుల్ వాస్నిక్‌ను సోనియా గాంధీ గోవాకు పంపారు. ఆదివారం జరిగిన సమావేశానికి ఏడుగురు ఎ మ్మెల్యేలు హాజరయ్యారు. దిగంబర్, లోబో హాజరుకాలేదు. గోవా అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక మంగళవారం జరుగాల్సి ఉండగా, ప్రస్తుత పరిణామాల దృష్ట్యా స్పీకర్ రమేశ్ తవాడ్కర్ వాయిదా వేశారు. మరో వైపు కాంగ్రెస్ బహిష్కృత నేత, హర్యానా ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయ్ అమిత్‌షా, జేపీ నడ్డాతో ఆదివారం భేటీ అయ్యారు.