Ebola : గుజరాత్ రాజధాని అహ్మదాబాద్లో ఎబోలా కలకలం రేపింది. ఎబోలా అనుమానితులైన కాంగో జాతీయుడు సహా మరో ముగ్గురిని ఐసోలేషన్లో ఉంచారు. ఈ విషయాన్ని గుజరాత్ ఆరోగ్య శాఖ మంత్రి ప్రఫుల్ పన్షేరియా బుధవారం వెల్లడించారు. వీరి నుంచి శాంపిల్స్ సేకరించి, ఎబోలా పరీక్షా కేంద్రానికి పంపించినట్లు ఆయన తెలిపారు. మరోవైపు అంతకుముందు కర్ణాటక రాజధాని బెంగళూరులో కూడా ఉగాండా నుంచి వచ్చిన ఒక మహిళలో ఎబోలా లక్షణాలు ఉండటంతో అక్కడి అధికారులు అప్రమత్తమయ్యారు.
ఆమెను బెంగళూరులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన అధికారులు అక్కడ ఐసోలేషన్లో ఉంచారు. అనంతరం ఆమె నుంచి శాంపిల్స్ సేకరించి ఎబోలా పరీక్షల కోసం పంపారు. ఈ ఫలితాల్లో ఆమెకు నెగెటివ్ వచ్చినట్లు కర్ణాటక ఆరోగ్య శాక మంత్రి దినేష్ గుండు రావ్ తెలిపారు. అందువల్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన సూచించారు. ప్రజల ఆరోగ్యం, అప్రమత్తత దృష్ట్యా ప్రతి ఒక్కరూ తగిన మెడికల్ ప్రోటోకాల్, ముందు జాగ్రత్త చర్యలు అనుసరించాలని ఆయన కోరారు. బెంగళూరుకు వచ్చిన మహిళ ఉగాండా నుంచి ఈ నెల 23న కెంపెగౌడ ఎయిర్పోర్టుకు చేరుకుంది. అనంతరం ఆమెను వైద్యాధికారులు నిరంతరం పర్యవేక్షించారు. ఈ క్రమంలో ఎబోలా లక్షణాలు కనిపించడంతో అధికారులు ఆమెను ఐసోలేషన్లో ఉంచి పరీక్షలు నిర్వహించారు.
ప్రస్తుతం ఎబోలా గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. దేశంలో ఎబోలా వ్యాపించకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. మరోవైపు ఆఫ్రికాలో ఎబోలా వేగంగా వ్యాపిస్తోంది. అందులోనూ కాంగోలో ఎక్కువగా వ్యాపిస్తుండటంతో పొరుగు దేశమైన ఉగాండా తన సరిహద్దును మూసేసింది.