Indus Treaty | భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలతో కొనసాగుతున్న యుద్ధ వాతావరణానికి కాస్త బ్రేక్ పడింది. కాల్పుల విరమణకు (ceasefire) పాకిస్థాన్ ప్రతిపాదించగా అందుకు భారత్ అంగీకరించిన విషయం తెలిసిందే. రెండు దేశాల నిర్ణయంతో సరిహద్దు రాష్ట్రాల్లోని పరిస్థితులు ప్రస్తుతం సాధారణ స్థితికి చేరుకున్నాయి. అయితే, ఉగ్రదాడి అనంతరం పాక్‌పై విధించిన ఆంక్షల విషయంలో మాత్రం భారత్ వైఖరిలో ఎలాంటి మార్పూ లేదని సంబంధిత వర్గాలు తాజాగా స్పష్టం చేశాయి.
పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్‌పై భారత్ పలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పటికీ.. పాక్‌తో దౌత్యపరమైన చర్యల విషయంలో ఎలాంటి మార్పూ లేదని భారత్ తాజాగా స్పష్టం చేసింది. సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు నిర్ణయం కొనసాగుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వీసాల రద్దు నిర్ణయంలోనూ భారత్ వైఖరిలో ఎలాంటి మార్పూ లేదని స్పష్టం చేశాయి.
గత నెల 22న జమ్ము కశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పెహల్గామ్ (Pahalgam)లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ నరమేధంలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడితో కశ్మీర్లోయతోపాటు దేశంమొత్తం భగ్గుమంది. ఈ ఉగ్రదాడికి ప్రతీకారంగా కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పాకిస్థాన్‌పై కఠిన చర్యలకు దిగింది. సింధూ జలాల ఒప్పందాన్ని (Indus Waters Treaty ) నిలిపివేసింది. సీమాంతర ఉగ్రవాదానికి ముగింపు పలికే వరకూ పాక్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం అమలును తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
ఏంటీ ఒప్పందం..?
సింధు, దాని ఉపనదుల జలాలను పంచుకోవడానికి ప్రపంచబ్యాంకు మధ్యవర్తిత్వంతో భారత్ (India), పాకిస్థాన్‌ల మధ్య ఒప్పందం కుదిరింది. 1960లో జరిగిన ఈ ఒప్పందంపై అప్పటి రెండు దేశాల ప్రధానులు జవహర్లాల్ నెహ్రూ, అయూబ్‌ఖాన్ సంతకాలు చేశారు. రెండు దేశాల మధ్య 6 నదులకు సంబంధించిన నీటి పంపకాల వివాదాలకు పరిష్కారంగా ఈ ఒప్పందం జరిగింది. రెండు దేశాల మధ్య ఇప్పటికీ అనేక వివాదాలు ఉన్నప్పటికీ.. ఈ ఒప్పందంపై ఎలాంటి ప్రభావం లేకపోవడం విశేషం.
ఈ ఒప్పందం ప్రకారం, సింధు నది లోయలోని నదులను తూర్పు, పశ్చిమ నదులుగా విభజించారు. తూర్పు ప్రాంతంలోని రవి, బియాస్, సట్లెజ్ నదులు భారతదేశానికి.. సింధు, చీనాబ్, జీలం నదులను పాకిస్థాన్‌కు ఇచ్చారు. పాకిస్థాన్‌లోని నదుల నీటిని విద్యుత్, నీటిపారుదలకు పరిమితంగా ఉపయోగించుకునే హక్కు కూడా భారతదేశానికి ఉన్నది. రెండు దేశాల మధ్య సహకారం కోసం శాశ్వత కమిషన్ ఏర్పాటైంది. దీనికి బాధ్యులుగా ఉన్న ఇరు దేశాల కమిషనర్లు ఏటా రెండుసార్లు సమావేశమవుతారు. ఈ నదులపై నిర్మించిన ప్రాజెక్టులను సందర్శించి క్షేత్రస్థాయిలో తనిఖీలు జరుపుతారు. ఈ ఒప్పందంలో ప్రపంచ బ్యాంకు విధాన బాధ్యతలు నిర్వహిస్తుంది. వివాదాలు తలెత్తినప్పుడు ఇరు దేశాలూ కోరితేనే జోక్యం చేసుకుంటుంది.
అమల్లోకి కాల్పుల విరమణ ఒప్పందం..
రెండు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం శనివారం సాయంత్రం 5 గంటల నుంచి అమల్లోకి వచ్చిందని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. ఒప్పందం అనంతరం ఆయన శనివారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. ‘పాకిస్థాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంవో) శనివారం మధ్యాహ్నం 3:30 గంటలకు భారత డీజీఎంవోకు ఫోన్ చేశారు. కాల్పుల విరమణకు ప్రతిపాదించారు. అనంతరం భూతల, గగనతల, సముద్రతలాల్లో కాల్పుల విరమణకు ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. సాయంత్రం 5 గంటల నుంచే తక్షణం, పూర్తి స్థాయిలో కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది’ అని ప్రకటించారు. ఒప్పందం అమలుపై ఇరువైపులా సైన్యానికి తగిన ఆదేశాలు జారీ అయ్యాయన్నారు. తదుపరి కార్యాచరణ కోసం రెండు దేశాల డీజీఎంవోలు ఈ నెల 12న మరోసారి సమావేశం కానున్నట్టు తెలిపారు. మరోవైపు సాయంత్రం 4:30 గంటల నుంచి తమ దేశంలో కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిందని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ తెలిపారు.
Also Read..
PM Modi | త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోదీ కీలక భేటీ
Donald Trump | కశ్మీర్ సమస్య కోసం రెండు దేశాలతో కలిసి పనిచేస్తా : డొనాల్డ్ ట్రంప్
సైనిక కార్యకలాపాల కోసం హ్యూమనాయిడ్ రోబో