పుణె, మే 10: అద్భుత ఆవిష్కరణలతో భారత సైనిక బలగాలకు వెన్నుదన్నుగా నిలుస్తున్న రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) శాస్త్రవేత్తలు మరో సరికొత్త ఆవిష్కరణ దిశగా అడుగులు వేస్తున్నారు. సరిహద్దుల్లో నిర్వహించే క్లిష్టమైన సైనిక కార్యకలాపాల్లో మానవ ప్రమేయాన్ని తగ్గించి, ప్రాణనష్టాన్ని నివారించాలన్న లక్ష్యంతో హ్యూమనాయిడ్ రోబోను అభివృద్ధి చేస్తున్నారు.
సైనికుల మాదిరిగా నడు స్తూ మానవ ఆదేశాలను స్వీకరించి సంక్లిష్టమైన బాధ్యతలను నిర్వర్తించగలిగే ఈ రోబోను డీఆర్డీవో ఆధ్వర్యంలోని కీలక రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ (ఇంజినీర్స్) ల్యాబ్ అభివృద్ధి చేస్తున్నట్టు అధికారులు శనివారం వెల్లడించారు. గత నాలుగేండ్ల నుంచి తమ బృందం ఈ హ్యూమనాయిడ్ రోబో ప్రాజెక్టులో నిమగ్నమైనట్టు ఆర్అండ్డీఈ (ఇంజినీర్స్)లోని సెం టర్ ఫర్ సిస్టమ్స్ అండ్ టెక్నాలజీస్ ఫర్ అడ్వాన్స్డ్ రోబోటిక్స్ గ్రూప్ డైరెక్టర్ ఎస్ఈ తలోల్ తెలిపారు.
అటవీ, పర్వత ప్రాంతాల్లాంటి కఠిన భూభాగాల్లో సైతం పనిచేయగలిగే విధంగా అభివృద్ధి చేశామని, అంతర్గత పరీక్షల్లో అవి కొన్ని పనులను విజయవంతంగా నిర్వర్తించగలిగాయని పీటీఐ వార్తా సంస్థకు వివరించారు. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ఈ రోబోను ఇటీవల పుణెలో నిర్వహించిన జాతీయ వర్క్‌షాప్‌లో ప్రదర్శించామని, ఆపరేటర్ ఆదేశాలను అర్థం చేసుకుని, వాటిని సమర్థంగా అమలు చేయగలిగేలా ఈ రోబోను తీర్చిదిద్దడంపై తమ బృందం దృష్టి సారించినట్టు తలోల్ చెప్పారు.