హైదరాబాద్ (స్పెషల్ టాస్క్ బ్యూరో,నమస్తే తెలంగాణ): చదువుల నుంచి వైద్యం వరకు, వ్యాపారం నుంచి వ్యవసాయం వరకూ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ-ఏఐ) ప్రమేయం లేని రంగం లేదంటే అతిశయోక్తి కాదు. మానవ ప్రమేయాన్ని తగ్గించి క్లిష్టమైన పనులను సులువుగా, వేగంగా నిర్వర్తించే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానమే ఏఐ. అయితే, ఏఐ కారణంగా పర్యావరణానికి ఒక విధంగా పెద్దయెత్తున నష్టం కూడా వాటిల్లుతున్నట్టు వాతావరణ నిపుణులు అంటున్నారు. సకల జీవరాశికి అవసరమైన నీటిని, విద్యుత్తును ఏఐ సాంకేతికత అమాంతం మింగేస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏదైనా సమాచారం కోసం గూగుల్‌లో సెర్చ్ చేస్తాం. మనం కీబోర్డ్‌తో టైప్ చేయగానే సదరు ఐటెమ్‌కు సంబంధించిన లక్షలాది లింకులు ప్రత్యక్షమవుతాయి. బ్యాగ్రౌండ్లో ఈ వర్క్‌ను ఏఐ నిర్వహిస్తుంది. చాట్‌జీపీటీ, గ్రోక్, డీప్‌సీక్ వంటి చాట్బాట్లో అడిగే ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇలాగే వస్తాయి. అయితే, ఒక్క సమాధానం రావడానికి డాటా సెంటర్లలోని పలు సర్వర్లు అనుసంధానమై సమాచారాన్ని షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం పెద్దయెత్తున కరెంట్ వినియోగించాల్సి వస్తున్నది. 2024లో ఏఐ ఆధారిత డాటా సెంటర్లు 460 టెరావాట్-అవర్ విద్యుత్తును వాడుకొన్నట్టు నివేదికలు చెప్తున్నాయి. ఇది స్వీడన్లో ఏడాదిపాటు వినియోగించే విద్యుత్తుకు సమానం. ఏఐల వాడకం పెరుగుతుండటంతో 2026నాటికి డాటా సెంటర్లు నడవడానికి 1000 టెరావాట్-అవర్ల విద్యుత్తు అవసరపడొచ్చని అంచనా.
ఏఐ రిజల్ట్స్ కోసం నిరంతరాయంగా సర్వర్లు పనిచేయడంతో అవి విపరీతంగా వేడెక్కిపోతాయి. దీంతో వాటిని చల్లబరిచేందుకు పెద్దయెత్తున నీళ్లు అవసరపడుతున్నాయి. 2024లో గూగుల్ కంపెనీ తమ డాటా సెంటర్లలోని సర్వర్లను చల్లబరిచేందుకు 22,700 కోట్ల లీటర్ల నీటిని వాడింది. అంటే తుర్కియేలో 33 శాతం మంది జనాభాకు ఏడాదిపాటు సరిపోయే నీటికి ఇది సమానం. రోజురోజుకూ ఏఐ వాడకం పెరిగిపోవడంతో, అదేస్థాయిలో కరెంట్, నీటి వినియోగం కూడా పెరిగిపోతున్నది. దీంతో ఏఐ కారణంగా పర్యావరణ సమతుల్యత దెబ్బతినే ప్రమాదమున్నదని పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణహిత ఏఐ సాంకేతికతను అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని పలువురు శాస్త్రవేత్తలు నొక్కి చెప్తున్నారు.