న్యూఢిల్లీ, జూలై 14: చిన్నపిల్లలకు తల్లిదండ్రులు ప్రేమగా అలవాటు చేసిన కొన్నిరకాల ఆహార పదార్థాలు వారికి చాలా ముప్పు కలిగించే ప్రమాదముందని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. నూనెలు, చక్కెరల వాడకాన్ని నియంత్రించాలని సూచించింది. కేంద్ర మహిళా, శిశు అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో సలహా సంఘం పిల్లలు-పౌష్టికాహారం అంశంపై మేలో ఓ అధ్యయనం చేసింది. ఈ నివేదికను జూలై 11న ఆ శాఖకు సమర్పించింది. సుమారు 6% పిల్లలు స్థూలకాయంతో బాధపడుతున్నట్టు తెలిపింది.
అధిక బరువు వల్ల రక్తపోటు, ఇతర గుండె జబ్బులు, మధుమేహంతోపాటు కొన్ని రకాల క్యాన్సర్ల బారినపడే ప్రమాదముందని వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు దృష్టి సారించాలని, పిల్లల ఆహార అలవాట్లపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించింది. ఐదేండ్లలోపు పిల్లల ఆహార అలవాట్లపై అంగన్వాడీ కేంద్రాలు దృష్టి సారించాలని పేర్కొంది. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ తగ్గిపోవడం, జీవనవిధానమే స్థూలకాయానికి ప్రధాన కారణాలు అని తెలిపింది.
పిల్లలకు ఎలాంటి ఆహారం అందించాలనే విషయంపైనా సదరు సలహా సంఘం పలు సూచనలు చేసింది. వంట నూనె రోజుకు 27-30 గ్రాములకు మించకూడదని తెలిపింది. రోజులో 10 శాతానికి మించి కొవ్వు పదార్థాలు ఉండకూడదని స్పష్టంచేసింది. కొవ్వు పదార్థాలు అధికంగా తింటే గుండె జబ్బులకు దారితీయవచ్చని పేర్కొంది. వెన్న, నెయ్యి, పామాయిల్, కొబ్బరినూనె వంటి కొవ్వులు అధికంగా కలిగిన పదార్థాలు మోతాదుగా వాడాలని, వనస్పతి, కృత్రిమమైన వెన్న, బేకరీ ఆహారాలను పూర్తిగా దూరం పెట్టాలని సూచించింది.