ECI : మహారాష్ట్ర (Maharastra) అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) కు సంబంధించిన ఓటర్ల జాబితాల్లో చాలా అవకతవకలు చోటుచేసుకున్నాయని, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ (Congress MP) రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) స్పందించింది. ఈ మేరకు అధికారిక ఎక్స్ (X) ఖాతాలో ట్వీట్ చేసింది. రాజకీయ పార్టీలు లేవనెత్తిన ప్రశ్నలు, సూచనలను తాము గౌరవిస్తామని ట్వీట్లో పేర్కొన్నది.
తాము దేశవ్యాప్తంగా ఒకేతీరుగా అనుసరించిన విధానపరమైన అంశాలతో త్వరలోనే లిఖితపూర్వకంగా సమాధానం ఇస్తామని ఎన్నికల సంఘం తెలిపింది. అంతకుముందు ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో ఉద్ధవ్ థారకే వర్గం శివసేన పార్టీ ఎంపీ సంజయ్ రౌత్, శరద్ పవార్ వర్గం ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలేతో కలిసి రాహుల్ గాంధీ జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితాలో ఎన్నో అవకతవకలు జరిగాయని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఆరోపించారు.
మహారాష్ట్ర ఓటర్ల జాబితాను తాము సమగ్రమంగా అధ్యయనం చేశామని, పలు అవకతకవలు జరిగినట్టు కనుగొన్నామని రాహుల్ చెప్పారు. లోక్సభ ఎన్నికలు జరిగిన ఐదు నెలలకు శాసనసభ ఎన్నికలు జరిగాయని, ఈ ఐదు నెలల్లో మహారాష్ట్రలో 39 లక్షల మంది ఓటర్లు కొత్తగా నమోదయ్యారన్నారు. 2019 విధానసభ ఎన్నికల తర్వాత నుంచి 2024 లోక్సభ ఎన్నికల వరకు 32 లక్షల మంది ఓటర్లు కొత్తగా నమోదు కాగా.. కేవలం ఐదు నెలల్లో 39 లక్షల మంది ఓటర్లు నమోదు కావడం ఏమిటని ప్రశ్నించారు.
రాష్ట్రంలోని మొత్తం ఓటర్ల జనాభా కంటే మహారాష్ట్రలో ఎక్కువ ఓటర్లు ఎలా వచ్చారని నిలదీశారు. మహారాష్ట్రలో అకస్మాత్తుగా కొత్త ఓటర్లను సృష్టించారని ఆరోపించారు. తాము పదేపదే ఈసీకి విజ్ఞప్తులు చేసినా పట్టింకోలేదన్నారు. మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితాలు తమకు ఇవ్వాలని ఈసీని కోరినట్టు రాహుల్ గాంధీ చెప్పారు. తద్వారా కొత్తగా చేసిన ఓటర్లు ఎవరనేది కచ్చితంగా అర్థమవుతుందన్నారు.