న్యూఢిల్లీ, మార్చి 21: దేశ వ్యాప్తంగా వాణిజ్య ఎల్పీజీ సరఫరాలో తీవ్ర ప్రతిష్టంభన నెలకొన్న క్రమంలో వివిధ రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మరో 20 శాతం వాణిజ్య ఎల్పీజీ సిలిండర్లను కేటాయిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. దీంతో మొత్తం వాణిజ్య గ్యాస్ కేటాయింపు 50 శాతానికి చేరుకుంది. ఈ అదనపు 20 శాతం కేటాయింపును రెస్టారెంట్లు, దాబాలు, హోటళ్లు, పారిశ్రామిక క్యాంటీన్లు, ఫుడ్ ప్రాసెసింగ్/డెయిరీ, సబ్సిడీ కేంటిన్లు/రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఔట్లెట్లు, స్థానిక సంస్థల ఆహార కేంద్రాలు, సామాజిక కిచెన్లకు కేటాయిస్తారు. అలాగే ఐదు కేజీల ఎల్పీజీని వలస కార్మికులకు కేటాయిస్తారని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, అంతకుముందు వాణిజ్య గ్యాస్ సరఫరాను ప్రభుత్వం 20 శాతం పునరుద్ధరించింది. అలీగే పీఎన్జీ విస్తరణ కోసం సంస్కరణలను సులభతరం చేయడం ఆధారంగా 10 శాతం కేటాయింపు ఇచ్చింది. ఇవన్నీ కలుపుకుంటే మొత్తం కేటాయింపు 50 శాతానికి చేరుకుంది.