న్యూఢిల్లీ, జనవరి 1: కొత్త ఏడాది తొలిరోజే కేంద్రం భారీ షాక్ ఇచ్చింది. వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల సిలిండర్ ధరను ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ఏకంగా రూ.111 పెంచేశాయి. గురువారం నుంచి కొత్త ధర అమల్లోకి వచ్చింది. గత ఏడాది జూన్ తర్వాత ఇంత భారీస్థాయిలో వాణిజ్య సిలిండర్ ధర పెరగడం ఇదే మొదటిసారి. అయితే 14.2 కిలోల గృహోపయోగ వంటగ్యాస్ ధరలో మాత్రం ఎటువంటి మార్పులు చేయలేదు. గడచిన రెండు నెలల కాలంలో రెండు సార్లు వాణిజ్య ఎల్పీజీ ధరను చమురు కంపెనీలు తగ్గించాయి.
డిసెంబర్ 1న సిలిండర్‌పై రూ. 15.50 తగ్గించగా అంతకుముందు నెల సిలిండర్‌పై రూ. 5 తగ్గించాయి. ఢిల్లీలో ప్రస్తుతం వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1,580.50 నుంచి రూ.1,691.50కి చేరుకుంది. వాణిజ్య సిలిండర్ ధరలు ఒక్కో నగరంలో ఒక్కో తీరున ఉన్నాయి. కాగా, దీంతోపాటు 5-కిలోల ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ(ఎఫ్టీఎల్) సిలిండర్ ధర కూడా గురువారం నుంచి రూ. 27 చొప్పున పెరిగింది. పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎటువంటి మార్పులు లేవు. చివరిసారి గత ఏడాది మార్చిలో పెట్రోల్,
డీజిల్ ధరలను లీటరుకు రూ.2 చొప్పున చమురు సంస్థలు తగ్గించాయి.