న్యూఢిల్లీ, జూన్ 5 : సోషల్ మీడియా ప్రచారంలో భాగంగా ఏర్పడిన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) శనివారం ఢిల్లీలో నిరసన ప్రదర్శనకు సంసిద్ధమవుతున్నది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శనకు సీజేపీ పిలుపునిచ్చింది. ఉదయం 9 గంటలకు నిరసన తెలిపేందుకు జంతర్ మంతర్ వద్ద సమావేశమవుతున్నట్లు శుక్రవారం ఎక్స్‌లో షేర్ చేసిన పోస్టులో సీజేపీ తెలిపింది. తమది శాంతియుత ప్రదర్శనగా అభివర్ణిస్తూ ఈ నిరసనలో పాలుపంచుకోవాలని తన మద్దతుదారులను కోరింది. రేపు కలుద్దాం బొద్దింకల్లారా, ధర్మేంద్ర ప్రధాన్‌ను ఓడిస్తూనే ఉంటాం అని ఆ పోస్టులో సీజేపీ పేర్కొన్నది. ఈ చిన్న జోక్‌ను ఒక విప్లవంగా మార్చే సమయం వచ్చింది అని సీజేపీ తెలిపింది. నీట్, సీబీఎస్ఈ, సీయూఈటీ, ఎస్ఎస్సీడీజీ పరీక్షల్లో అవకతవకలపై నిరసన ప్రకటించాలని ప్రజలకు పిలుపునిచ్చింది. వరుస పేపర్ లీకులతో అసమర్థుడిగా నిరూపించుకున్న కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను బర్తరఫ్ చేయాలని ప్రధాని నరేంద్ర మోదీకి సీజేపీ అధికార ప్రతినిధులు ఎక్స్‌లో విజ్ఞప్తి చేశారు. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే శనివారం ఉదయం 8 గంటలకు బోస్టన్ నుండి ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి రానున్నారు. పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఆయనకు స్వాగతం పలుకుతారు. అనంతరం పార్లమెంట్ స్ట్రీట్ పోలీసు స్టేషన్లో తమ నిరసన ప్రదర్శనకు అనుమతి కోరతారు.
నిరసన సమయంలో క్రమశిక్షణతో ఉండేందుకు పాల్గొనేవారు పాటించాల్సినవి, పాటించకూడనివి అంటూ వాటి జాబితాను వివరించింది.త్రివర్ణ పతాకాన్ని, ఒక నోటు పుస్తకాన్ని తీసుకురావాలని, ప్రతి విషయాన్ని నమోదు చేయాలని, ఆకతాయిలపై ఫిర్యాదు చేయాలని సూచించారు. అలాగే చేయకూడనివి తెలియచేస్తూ ఉద్యమానికి అండగా ఉండాలని భావిస్తే ఒంటరిగా రావద్దని, పూలు విసరవద్దని, చేతికి అందచేయాలని, ట్రోల్స్, రెచ్చగొట్టే వారితో వాదనకు దిగవద్దని పేర్కొన్నది.
కాక్రోచ్ జనతా పార్టీ శనివారం న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో, దీనివల్ల తలెత్తే శాంతిభద్రతల సమస్యలపై దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు ఢిల్లీ హైకోర్టు శుక్రవారం నిరాకరించింది.
లండన్‌లోని ఒక విశ్వవిద్యాలయంలో భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) సూర్యకాంత్ ముఖ్యవక్తగా ప్రసంగించిన ఒక కార్యక్రమంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. భారతదేశంలో అసమ్మతిని అణచివేస్తున్నారనే ఆరోపణలపై ఆయనను ప్రశ్నించాలనుకున్న వారికి, ఆ ప్రశ్నలు అప్రస్తుతమైనవని చెప్పిన యాంకర్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. కృత్రిమ మేధస్సు, అంతర్జాతీయ చట్టం అనే అంశంపై లండన్ వర్సిటీలోని బిర్క్‌బెక్ కళాశాల్లో సీజేఐ సూర్యకాంత్ ఉపన్యాసం ఇచ్చారు. సీజేఐ ఉపన్యాసం తర్వాత జరిగిన ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్‌లో ఒక వ్యక్తి ఈ ప్రశ్న అడగడం, దయచేసి మమ్మల్ని గౌరవించండి అంటూ ఒక విద్యార్థి అరుస్తున్న వీడియో క్లిప్‌లను కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ప్రధాన అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ సోషల్ మీడియాలో తిరిగి షేర్ చేశారు. ఉపన్యాస కార్యక్రమానికి హాజరైన ఒక మహిళ సీజేఐని ఉద్దేశించి మాట్లాడుతూ భారత్‌లో భిన్నాభిప్రాయాల పట్ల పెరుగుతున్న వ్యతిరేకత గురించి దేశంలోనూ, అంతర్జాతీయంగానూ చాలా మంది న్యాయ పరిశీలకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని మేము ఇప్పుడు వింటున్నాము. ఈ వ్యతిరేకత మీ ప్రసంగంలో కొంతవరకు ప్రతిబింబిస్తున్నట్లు కనిపిస్తున్నది. అంటూ ఇటీవల సీజేఐ చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావించారు. వేదికపై ఉన్న వారిలో ఒక వ్యక్తి అడ్డుకుంటూ గౌరవంగా చెబుతున్నాను. నన్ను క్షమించండి. ఈ అంశం ఏఐ, అంతర్జాతీయ చట్టానికి సంబంధించినది కాబట్టి ఆ ప్రశ్నను తీసుకోలేను అని అనడం ఆ క్లిప్‌లో వినిపించింది.