లక్నో : రాష్ట్రంలో ప్రతి మహిళ సురక్షితంగా ఉండేందుకు తమ ప్రభుత్వం పోలీస్ సంస్కరణలను తీసుకువచ్చిందని యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్ అన్నారు. 2017కి ముందు పశ్చిమ యూపీలో బాలికలు స్కూలుకు వెళ్లేందుకు భయపడేవారని ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవని చెప్పారు. ఐదేండ్ల తన పాలనలో సాధించిన విజయాలను నెహ్రూ సెంటర్ లండన్ డైరెక్టర్, రచయిత అమిష్ త్రిపాఠీకి యోగి వివరించారు. నేరగాళ్లు, మాఫియా ఆటకట్టించేందుకు తమ ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని తెలిపారు.
2017లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో ఖజానా ఖాళీగా ఉందని, జీతాలు చెల్లించేందుకూ డబ్బులు లేవని చెప్పారు. 2017కు ముందు కేవలం రాజకీయ నేతలే సంతోషంగా ఉన్నారని, ప్రజలు ఆగ్రహంతో బీజేపీకి పట్టం కట్టారని తెలిపారు. తమ ప్రభుత్వం వ్యయాలను అరికట్టి రాష్ట్ర ప్రభుత్వ రాబడి పెంచిందని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీనే అభివృద్ధికి కట్టుబడి పాలన చేపడుతుందని అన్నారు. తమ హయాంలో మాఫియాకు, నేరగాళ్లకు చోటు లేదని స్పష్టం చేశారు. మహిళల భద్రత, యువతకు ఉపాధి, రైతుల పురోగతి కోసం బీజేపీ పాటుపడుతోందని చెప్పారు. ఎస్పీ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, బీజేపీ హయాంలోనే అభివృద్ధి పనులు ఊపందుకున్నాయని వివరించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ నేరగాళ్లు, విచ్చిన్నకర శక్తులకు అధికంగా టికెట్లు ఇచ్చిందని దుయ్యబట్టారు. ఇక యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం నిలుపుకునేందుకు యోగి ఆదిత్యానాధ్ సారధ్యంలోని బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతుండగా, రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకతను సొమ్ము చేసుకుని అందలం ఎక్కాలని అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీ చెమటోడుస్తోంది. ఇక ప్రియాంక గాంధీ ఇమేజ్‌తో ఉనికి చాటుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుండగా, సత్తా చాటేందుకు మాయావతి సారధ్యంలోని బీఎస్పీ సన్నద్ధమవుతోంది. ఇక ఫిబ్రవరి 10 నుంచి ఏడు దశల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు.