న్యూఢిల్లీ, ఆగస్టు 29: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ, ఎన్నికల కమిషన్ కుమ్మక్కై ఓటు చోరీకి పాల్పడుతున్నాయంటూ ఆరోపణలు గుప్పిస్తున్న కాంగ్రెస్ పార్టీని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన తాజా వ్యాఖ్యలు ఇరకాటంలోకి నెట్టాయి. 1991 లోక్‌సభ ఎన్నికల్లో మోసం కారణంగానే తాను ఓడిపోయానంటూ సిద్ధరామయ్య చేసిన ఆరోపణలు కాంగ్రెస్ పార్టీని ఇబ్బందికర స్థితిలోకి నెట్టేశాయి. 34 ఏండ్ల క్రితం ఉత్తర కర్ణాటకలోని కొప్పల్ లోక్‌సభ స్థానం నుంచి జనతా దళ్ (సెక్యులర్) అభ్యర్థిగా సిద్ధరామయ్య పోటీ చేశారు. ప్రత్యర్థిగా నిలబడిన బసవరాజ్ పాటిల్ అన్వరీ జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొంది కాంగ్రెస్‌లో చేరారు.
1991 ఎన్నికల్లో 11,200 మెజారిటీతో సిద్ధరామయ్యపై అన్వరీ గెలుపొందారు. 22,243 ఓట్లను తిరస్కరిస్తూ కౌంటింగ్ అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ సిద్ధరామయ్య కర్ణాటక హైకోర్టులో కేసు వేశారు. తిరస్కరించిన ఓట్లతో తాను గెలుపొంది ఉండేవాడినన్నది సిద్ధరామయ్య వాదన.
ఈ ఉదంతాన్ని గురువారం బెంగళూరులో కర్ణాటక మాజీ అడ్వకేట్ జనరల్ రవవిర్మ కుమార్ సన్మానోత్సవ సభలో సిద్ధరామయ్య గుర్తు చేయడం వివాదానికి దారి తీసింది. సిద్ధూ ఆరోపణలను ఆయనకే బీజేపీ తిప్పికొట్టింది. బీజేపీ ఐటీ సెల్ అధిపతి అమిత్ మాల్వీయ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. అయితే బీజేపీ విమర్శలను కాంగ్రెస్ తేలికగా కొట్టిపారేసింది. తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి బీజేపీ నాటి అనవసర విషయాలను లేవనెత్తుతోందని శివాజీనగర్ ఎమ్మెల్యే రిజ్వాన్ అర్షద్ వ్యాఖ్యానించారు.