బెంగళూరు, నవంబర్ 1: మాతృ భాష కన్నడను నిర్లక్ష్యం చేస్తూ హిందీని బలవంతంగా రుద్దడం పట్ల కేంద్రంపై కర్ణాటక సీఎం సిద్ధ రామయ్య (Siddaramaiah) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కువగా హిందీ, ఇంగ్లిష్‌పై ఆధారపడటం వల్ల పిల్లల్లోని సహజ సృజనాత్మకత నశిస్తుందని ఆయన పేర్కొన్నారు. బెంగళూరులో జరిగిన రాజ్యోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ కర్ణాటక పట్ల కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి దృక్పథంతో వ్యవహరిస్తున్నదని అన్నారు.
హిందీ, సంస్కృతం భాషలను ప్రోత్సహిస్తున్న రాష్ర్టాలకు ఉదారంగా నిధులు ఇస్తూ కర్ణాటక లాంటి ఇతర ప్రాంతీయ భాషా రాష్ర్టాలను కేంద్రం పక్కన పడేస్తున్నదని ఆయన ఆరోపించారు. హిందీని బలవంతంగా అమలు చేయడానికి కేంద్రం నిరంతర ప్రయత్నాలు చేస్తున్నదని అన్నారు. విద్యా వ్యవస్థలో హిందీ, ఇంగ్లిష్ భాషల ప్రాబల్యం పెరిగిపోతుండటం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇది పిల్లల సృజనాత్మకతను నశింపచేస్తూ వారి మూలాలను దెబ్బ తీస్తోందని అన్నారు.