బెంగళూరు, సెప్టెంబర్ 28: కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, జేపీ నడ్డా సహా కర్ణాటక బీజేపీ నేతలపై సంచలన ఆరోపణలు వెలువడ్డాయి. దీంతో కేంద్ర మంత్రులు, రాష్ట్ర బీజేపీ నాయకులకు వ్యతిరేకంగా శనివారం బెంగళూరులోని తిలక్‌నగర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. కర్ణాటకలో పలు కార్పొరేట్ కంపెనీలపై ఈడీ దాడులు చేయటం వెనుక కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఉన్నారని, వాటి ఆస్తుల్ని జప్తు, స్వాధీనం చేస్తామని బెదిరింపులకు దిగటంతో..సీఈవోలు, ఎండీలు, టాప్ ఎగ్జిక్యూటివ్స్ బలవంతంగా ఎన్నికల బాండ్స్ కొనుగోలు చేశారని ‘జనాధికార సంఘర్ష్ పరిషత్’ (జేఎస్పీ) సహ అధ్యక్షుడు ఆదర్శ్ ఆర్ అయ్యర్ ఆరోపించారు. బాండ్ల కొనుగోలు ముసుగులో దాదాపు రూ.8 వేల కోట్ల దోపిడీ జరిగిందని అన్నారు.
కేంద్ర మంత్రులు, కేంద్ర, రాష్ట్ర బీజేపీ నాయకులకు ఈ కుట్రలో పాత్ర ఉందని తన ఫిర్యాదులో ఆరోపించారు. బాండ్ల ద్వారా సమకూరినదంతా బీజేపీ కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు నగదుగా మార్చుకున్నారని, బాండ్ల కొనుగోలు ముసుగులో ఈ దోపిడీ జరిగిందని అయ్యర్ తెలిపారు. ఇందుకోసం బీజేపీ నాయకులు వివిధ స్థాయిలో కలిసి పనిచేశారని చెప్పారు. ఈ ఏడాది మార్చి 30న తిలక్‌నగర్ పోలీస్ స్టేషన్లో అయ్యర్ ఫిర్యాదు చేశారు. అక్కడి డీసీపీ అధికారిని కూడా కలుసుకున్నారు. ఆ ఫిర్యాదుపై పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. దీంతో దీనిపై ఆయన కోర్టును ఆశ్రయించారు. పోలీసు అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. బెంగళూరులోని స్పెషల్ కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు తాజాగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
నిర్మలా సీతారామన్‌పై కేసు నమోదైనందున ఆమె వెంటనే కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య డిమాండ్ చేశారు. ఆమె రాజీనామాను డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలు ఎప్పుడు ఆందోళన చేస్తారని ప్రశ్నించారు. ఎన్నికల బాండ్ల కేసులో నిష్పాక్షిక విచారణ జరిగితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం రాజీనామా చేయాల్సి వస్తుందన్నారు.