బెంగళూరు, జనవరి 7: కర్ణాటక కాంగ్రెస్‌లో విందు రాజకీయాలు జోరందుకున్నాయి. ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడి మార్పు ఉంటుందనే ప్రచారం నేపథ్యంలో నాయకులు వర్గాలుగా విడిపోయి సమావేశాలు పెట్టుకుంటున్నారు. రాజకీయ పరిణామాలపై మంతనాలు సాగిస్తూ పైచేయి కోసం వ్యూహాలు రచిస్తున్నారు. జనవరి 2న మంత్రి సతీశ్ జార్కిహోలి నివాసంలో కొందరు మంత్రులు, ఎమ్మెల్యేల విందు జరగగా, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సైతం హాజరయ్యారు.
పీసీసీ అధ్యక్షుడు, సీఎం పదవికి ప్రధాన పోటీదారు డీకే శివకుమార్ విదేశాల్లో ఉండగా ఈ భేటీ జరగడం అనేక ఊహాగానాలకు తావిచ్చింది. ఇది కొనసాగుతుండగానే బుధవారం హోంమంత్రి పరమేశ్వర నాయకత్వంలో ఎస్సీ, ఎస్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు విందు ఏర్పాటు చేసుకోవాలని అనుకున్నారు.
విదేశాల నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లిన డీకే శివకుమార్ రాష్ట్రంలోని పరిణామాలపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో చర్చలు జరిపారు. ఈ ఇద్దరి సమావేశ ప్రభావం బెంగళూరులో కనిపించింది. విందు ఏర్పాటు చేయాలనుకున్న పరమేశ్వరతో రాష్ట్ర కాంగ్రెస్ ఇంఛార్జి రణ్‌దీప్ సుర్జేవాలా సమావేశమై.. విందును వాయిదా వేసుకునేలా చేశారు. అధిష్ఠానానికి డీకే ఫిర్యాదుతోనే ఈ విందు వాయిదా పడిందనే ప్రచారం జరుగుతున్నది.