బెంగళూరు: ముడా కుంభకోణం, ఇతర అవినీతి ఆరోపణల నేపథ్యంలో తనను పదవి నుంచి తొలగిస్తారని జరుగుతున్న ప్రచారాన్ని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఖండించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి పదవి ఖాళీగా లేదని, ఎలాంటి సందేహం లేకుండా తానే పూర్తి కాలం ఈ పదవిలో కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. ఇటీవలి కాలంలో సిద్ధరామయ్యను తొలగిస్తారని వార్తలు రావడంతో ఆ పదవిని చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలు బహిరంగంగా తమ కోరికను వ్యక్తం చేశారు.
దీనిపై సిద్ధూ స్పందిస్తూ ‘ఎవరూ ఎలాంటి ప్రకటనా ఇవ్వలేదు. ఎవరూ తాము ముఖ్యమంత్రిని అవుతామని ప్రకటించలేదు. అయినా సీఎం పదవి ఖాళీగా లేదు. అలాంటప్పుడు ఎవరైనా ముఖ్యమంత్రి అవుతామని ఎందుకు అంటారు. అందరూ చెప్పేదేమిటంటే సిద్ధరామయ్యే ముఖ్యమంత్రిగా కొనసాగుతారు’ అని పేర్కొన్నారు.