చెన్నై: జనాభా ప్రాతిపాదికన నియోజకవర్గాల పునర్విభజన చేసి దక్షిణాది రాష్ర్టాలను శిక్షించొద్దని, అలా చేస్తే తాము తీవ్రంగా ప్రతిఘటిస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కేంద్రాన్ని హెచ్చరించారు. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను అన్యాయంగా జనాభా ప్రాతిపాదికన చేస్తే తమిళనాడు, డీఎంకే ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదని స్పష్టం చేశారు. క్రమశిక్షణతో జనాభా నియంత్రణకు సహకరించిన దక్షిణాది రాష్ర్టాలకు మీరు ఇస్తున్న ప్రతిఫలం ఇదేనా అని ఆయన ప్రశ్నించారు.
తన 72వ పుట్టినరోజు సందర్భంగా ఆయన శుక్రవారం పార్టీ వర్గాలతో మాట్లాడుతూ తమిళనాడు సంక్షేమానికి, భవిష్యత్‌కు భంగం కలిగించే ఎవరినీ, ఏ చర్యనూ అంగీకరించబోమన్నారు. ‘మనమంతా ఐక్యంగా కలిపి రాష్ట్ర హక్కుల కోసం పోరాడుదాం. తమిళనాడు పోరాడుతుంది.. గెలుస్తుంది’ అని ఆయన పార్గీ వర్గాలకు పిలుపునిచ్చారు. డీలిమిటేషన్ వల్ల కలిగే దుష్పరిణామాలు, అది రాష్ట్ర ఆత్మగౌరవాన్ని ఎలా దెబ్బ తీస్తున్నది ప్రజలకు వివరించాలని కోరారు. కేంద్రం చర్యలపై తాము చేస్తున్న పోరాటానికి తెలంగాణ, కర్ణాటక, పంజాబ్ రాష్ర్టాల నుంచి మద్దతు వచ్చిందన్నారు.
తమిళనాడులో హిందీ భాషను బలవంతంగా రుద్దడానికి బీజేపీ నేతలు చేస్తున్న ప్రయత్నాలను స్టాలిన్ ఎండగట్టారు. ‘ఉత్తరాదిలో మీరు పానీపూరి, టీ కొనడానికి, టాయిలెట్లకు వెళ్లడానికి హిందీ తప్పక అవసరం’ అని ఆయన ఎక్స్‌లో వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ‘ఈ కృత్రిమ మేధ యుగంలో కూడా పాఠశాలల్లో మూడో భాషగా హిందీ ఉండాలనడం అర్థరహితం. ఇప్పటికే అడ్వాన్స్డ్ ట్రాన్స్లేషన్ సాంకేతికత భాషా అడ్డంకులను చెరిపేసింది’ అని స్టాలిన్ పేర్కొన్నారు.