CM Mamata Banerjee | కోల్‌కతా, ఆగస్టు 22: కోల్‌కతాలోని ఆర్జీ కర్ దవాఖానలో హత్యాచార ఘటనతో దేశం అట్టుడుకుతున్న క్రమంలో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోదీకి గురువారం లేఖ రాశారు. అత్యాచార నేరాలలో నేరస్తులకు తీవ్రమైన శిక్షను విధించేలా కేంద్రం కఠిన చట్టాలను చేయాలని డిమాండ్ చేశారు.
అంతేకాకుండా ఈ కేసుల విచారణ త్వరితగతిన పూర్తిచేసి బాధితులకు న్యాయం చేయడానికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని ఆమె కోరారు. సీఎం ప్రధాన సలహాదారు అలపన్ బందోపాధ్యాయ గురువారం ఆ లేఖను మీడియాకు చదివి వినిపించారు.
దేశంలో రోజుకు దాదాపు 90 లైంగిక దాడి కేసులు నమోదవుతున్నాయని, అందులో చాలామంది బాధితులు హత్యకు గురవుతున్నారని మమత తన లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి నేరాలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు విధించేలా కేంద్రం చట్టంలో మార్పులు చేయాలని కోరారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి విచారణ 15 రోజుల్లో ముగించాలని ఆమె ప్రధానికి విజ్ఞప్తి చేశారు.