Mamata Banerjee : పశ్చిమబెంగాల్ (West Bengal) రాష్ట్రాన్ని ఇటీవల వరదలు అతలాకుతలం చేశాయి. దీనికి సంబంధించి బెంగాల్ సీఎం (Bengal CM) మమతాబెనర్జీ (Mamata Banerjee) పొరుగు దేశమైన భూటాన్ (Bhutan) పై సంచలన ఆరోపణలు చేశారు. భూటాన్ నుంచి ఆకస్మికంగా వెల్లువెత్తిన నీటి ప్రవాహం వల్లే తమ రాష్ట్రంలో తీవ్ర నష్టం వాటిల్లిందని, దీనికి ఆ దేశమే బాధ్యత వహించి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
జల్పాయీగురి జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం.. సహాయక చర్యలను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. వరద బాధితులకు అవసరమైన అన్ని సహాయక, పునరావాస కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా చూసుకుంటున్నదని చెప్పారు. ఈ విపత్కర పరిస్థితుల్లో కేంద్రం నుంచి తమకు ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదని ఆరోపించారు.
ఇటీవల డార్జిలింగ్, జల్పాయీగురి జిల్లాల్లో భారీ వర్షాలు కురవడం, కొండచరియలు విరిగిపడటం లాంటి పరిణామాలతో తీవ్ర విధ్వంసం జరిగింది. ఈ ప్రకృతి వైపరీత్యాల కారణంగా సుమారు 32 మంది ప్రాణాలు కోల్పోగా.. వేలమంది నిరాశ్రయులయ్యారు.