న్యూఢిల్లీ, జనవరి 16: ఢిల్లీ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) సక్సేనా మధ్య వివాదం రోజురోజుకూ ముదురుతున్నది. తరచూ ప్రభుత్వ నిర్ణయాల్లో జోక్యం చేసుకుంటున్న ఎల్జీ తీరుపై ఆప్ సర్కారు నిరసన స్వరం పెంచింది. శిక్షణ కోసం ఉపాధ్యాయులను ఫిన్లాండ్కు పంపాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను ఎల్జీ అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. ఎల్జీ తీరును నిరసిస్తూ సీఎం కేజ్రీవాల్ నేతృత్వంలో ఆప్ ఎమ్మెల్యేలు సోమవారం అసెంబ్లీ నుంచి సక్సేనా ఆఫీసుకు ర్యాలీ నిర్వహించారు. అయితే ఆఫీసుకు 10 అడుగుల దూరంలో వీరిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కేజ్రీవాల్, ఎమ్మెల్యేలు అక్కడే రోడ్డుపై బైఠాయించారు. తాము ఎల్జీని కలువాలనుకుంటున్నట్టు కేజ్రీవాల్ పోలీసులతో చెప్పారు.
పోలీసులు విషయాన్ని ఎల్జీకి చేరవేయడంతో కేజ్రీవాల్, సిసోడియాకు మాత్రమే అనుమతినిచ్చారు. దీంతో కేజ్రీవాల్ ఎమ్మెల్యేలు కూడా వస్తారని సమాధానమిచ్చారు. అందుకు ఎల్జీ అనుమతించకపోవడంతో కలువకుండానే వెనుదిరిగారు. అయితే ర్యాలీ ప్రారంభమైనప్పటి నుంచి ముగిసే వరకు కేజ్రీవాల్‌తోపాటు ఎమ్మెల్యేలు ప్లకార్డులను పట్టుకొని ఎల్జీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ప్రభుత్వం ఉన్నదెందుకు?
ఎల్జీ వ్యవహరిస్తున్న తీరు వల్ల ఢిల్లీ అభివృద్ధి కుంటుపడుతున్నదని కేజ్రీవాల్ ఆరోపించారు. రాజకీయ కక్షసాధింపుతోనే ఆయన ఇలా వ్యవహిస్తున్నారని విమర్శించారు. ‘ఎల్జీ విధులు ఏంటి? ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను పరిశీలించి యస్, నో అని చెప్పడమే. అంతేగానీ మా హోంవర్క్‌ను పరిశీలించడానికి ఆయన మా హెడ్మాస్టర్ కాదు’ అని కేజ్రీవాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఉపాధ్యాయులను శిక్షణ కోసం ఫిన్లాండ్ పంపకుండా ఎల్జీ ఎలా అడ్డుకుంటారని నిలదీశారు. ఇదే కాదు.. ప్రతి విషయంలోనూ ఎల్జీ ఏకపక్షంగా వ్యవహరిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. అలాంటప్పుడు ప్రజల ఓట్లతో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం ఉన్నదెందుకని ప్రశ్నించారు. ఒకవేళ ఎల్జీలో నిజాయితీ ఉంటే.. ఉపాధ్యాయులను ఫిన్లాండ్కు పంపడాన్ని అడ్డుకోవడం లేదని రాతపూర్వకంగా సమాధానం ఇవ్వాలని కోరారు. ఢిల్లీ ప్రజల కోసం, అభివృద్ధి కోసం ఎంతకైనా పోరాడుతామని కేజ్రీవాల్ స్పష్టంచేశారు.