దేశంలో విద్వేషం నింపే శక్తులను పారదోలాలని, విద్వేషం పెరిగితే దేశానికే నష్టమని సీఎం కేసీఆర్ అన్నారు. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో కలిసి ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. దేశానికి బీజేపీ ప్రభుత్వం ఏం చెయ్యలేదని విమర్శించిన కేసీఆర్. ధరలు పెరిగి పేదలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు.
ఎయిర్‌పోర్టులు, రైల్వేలు అన్నీ ప్రైవేటీకరిస్తున్నారని, ప్రతిష్టాత్మక సంస్థ ఎల్ఐసీని ప్రైవేటీకరణ చేయడం ఏంటని నిలదీశారు. మేకిన్ ఇండియా అనేది వట్టిమాటేనని, అన్ని వస్తువులు ఇతర దేశాల నుంచి దిగుమతి అవుతూనే ఉన్నాయని చెప్పారు. ఒక పక్క బేటీ బచావో బేటీ పడావో అంటున్నారని, కానీ మరో పక్క అత్యాచారాలు పెరిగిపోతున్నాయని విమర్శించారు.
బీజేపీ పాలనలో దేశం తీవ్రంగా నష్టపోయిందని, అందుకే దేశంలో బీజేపీ వ్యతిరేక శక్తులు ఏకం కావాలని, ఈ విషయం గురించి నితీశ్‌తో కూడా చర్చించామని చెప్పారు. దేశానికి రొటీన్ ప్రభుత్వాలు వద్దని, భారత్‌ను మార్చే ప్రభుత్వం రావాలని చెప్పారు. బీజేపీ కేవలం అబద్ధాలతోనే పాలన సాగిస్తోందని విమర్శించారు. ఈ పరిణామాల నేపథ్యంలో విపక్షాలను ఏకం చేసే విషయమై నితీశ్‌తో చర్చించినట్లు కేసీఆర్ తెలిపారు.
నితీశ్ కూడా బీజేపీ ముక్త్ భారత్ కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. ప్రపంచ దేశాల ముందు భారత్ పరువు తీస్తోందని బీజేపీపై మండిపడ్డారు. అలాంటి బీజేపీని సాగనంపితేనే భారతదేశం ప్రగతి పథంలో నడుస్తుందన్నారు. అందుకే బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేస్తున్నామని, ఆ పార్టీని వ్యతిరేకించే వారందరినీ కలుపుకొని పోతామని స్పష్టంచేశారు.
తమకు ఎవరు నాయకత్వం వహిస్తారనేది ఎన్నికల సమయంలో, విస్తృత చర్చల అనంతరం తీసుకునే నిర్ణయమని చెప్పారు. గుజరాత్ మోడల్ గురించి ఒక విలేకరి ప్రశ్నించగా.. గుజరాత్ మోడల్ విఫలమైందని, అలాంటి మోడల్ దేశానికి అవసరమా అని కేసీఆర్ ప్రశ్నించారు. గుజరాత్లో కూడా తాగునీరు, విద్యుత్ సమస్యలు ఉన్నాయని చెప్పారు.