ముంబై, ఫిబ్రవరి 3: బుల్ ఎట్టకేలకు రంకె వేసింది. గత కొన్ని నెలలుగా స్తబ్దుగా కొనసాగిన సూచీలు మళ్లీ దౌడ్తీశాయి. భారత్-అమెరికా దేశాల మధ్య ఎట్టకేలకు వాణిజ్య ఒప్పందం కుదరడంతో బుల్ ఆకాశమే హద్దుగా దూసుకుపోయింది. దేశీయ ఉత్పత్తులపై ప్రతీకార సుంకాన్ని 18 శాతానికి తగ్గిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం మదుపరుల్లో ఉత్సాహాన్ని నింపింది. మంగళవారం ఏకంగా మూడు వేలకు పైగా పాయింట్ల లాభంతో ప్రారంభమైన సూచీలు చివరి వరకు అదే ట్రెండ్‌ను కొనసాగించింది. ఇంట్రాడేలో 4,205 పాయింట్లు ఎగిసిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 2,072.67 పాయింట్లు లేదా 2.54 శాతం అందుకొని 83,739.13 వద్ద స్థిరపడింది.
గడిచిన ఎనిమిది నెలల్లో ఒకేరోజు ఇంతటి భారీ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. మరో సూచీ నిఫ్టీ కూడా కదంతొక్కింది. ఇంట్రాడేలో 1,252 పాయింట్లు ఎగబాకిన నిఫ్టీ చివరకు 639.15 పాయింట్ల లాభంతో 25,727.55 వద్ద ముగిసింది. ట్రేడ్ డీల్‌పై గత నాలుగు నెలలుగా భారత్-అమెరికా దేశాల మధ్య జరుగుతున్న చర్చలు నేడు కొలిక్కిరావడం సూచీల్లో జోష్ పెరిగిందని దలాల్‌స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి. ఈ ట్రేడ్ డీల్‌లో టెక్స్టైల్, లెదర్, జెమ్స్ అండ్ జ్యూవెల్లరీ, సీఫుడ్, కెమికల్స్ రంగాలకు చెందిన షేర్లు భారీగా పుంజుకున్నాయి. దేశీయ ఈక్విటీ మార్కెట్లలో గణనీయమైన ర్యాలీ కనబడింది..ట్రేడ్ డీల్తోపాటు రూపాయి బలోపేతం కావడం, ఎఫ్ఐఐలు భారీగా నిధులు కుమ్మరించడం కూడా కలిసొచ్చిందని జియోజిట్ ఇన్వెస్ట్మెంట్స్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.
ట్రేడ్ డీల్ ఒకేకావడంతో జెమ్స్ అండ్ జ్యువెల్లరీ, వాహన రంగ షేర్లలో భారీ ర్యాలీ చోటు చేసుకున్నది. ప్రస్తుతం వీటిపై విధిస్తున్న 25 శాతం సుంకాన్ని 18 శాతానికి తగ్గిస్తూ అమెరికా తీసుకున్న నిర్ణయంతో ఈరంగ షేర్లు దౌడ్తీశాయి. గోల్డాయిమ్ ఇంటర్నేషనల్ షేరు అత్యధికంగా 20 శాతం లాభపడింది. దీంతోపాటు వైభవ్ గ్లోబల్ 9.13 శాతం, కల్యాణ్ జ్యూవెల్లర్స్ ఇండియా 4.91 శాతం చొప్పున బలపడ్డాయి. వీటితోపాటు వాహన రంగానికి చెందిన భారత్ ఫోర్జ్ 6.56 శాతం, సంవర్ధన మధర్సన్ ఇంటర్నేషనల్ 6.44 శాతం, సోనా బీఎల్డబ్ల్యూ 6.13 శాతం, సుందరం ఫాస్టనర్స్ 4.01 శాతం, బాష్ 3.10 శాతం లాభపడ్డాయి.
విదేశాలకు సముద్ర ఉత్పత్తులను ఎగుమతి చేసే సంస్థల షేర్లు కూడా కదంతొక్కాయి. సీఫుడ్ ఎగుమతి చేసే సంస్థలు, ప్రత్యేక కెమికల్స్ తయారీ సంస్థల షేర్లు 20 శాతం వరకు బలపడ్డాయి. వీటిలో అవంతి ఫీడ్స్, అపెక్స్ ఫ్రోజెన్ ఫుడ్స్ షేర్లు 20 శాతం చొప్పున పెరిగాయి. దీంతో ఈ రెండు కంపెనీల షేర్లు అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. వీటితోపాటు జీల్ ఆక్వా షేరు 10.58 శాతం, కింగ్స్ ఇన్ఫ్రా వెంచర్స్ 7.64 శాతం, మక్క ప్రోటిన్స్ 5 శాతం, కోస్టల్ కార్పొరేషన్ 5 శాతం అధికమయ్యాయి. అలాగే కెమికల్స్ రంగానికి చెందిన ఆర్తీ ఇండస్ట్రీస్ 15.10 శాతం లాభపడగా..గుజరాత్ ఫ్లూరోకెమికల్స్ 6.82 శాతం, నవిన్ ఫ్లూరో ఇంటర్నేషనల్ 6.22 శాతం, నియోజెన్ కెమికల్స్ 6.19 శాతం, అతుల్ లిమిటెడ్ 5.25 శాతం, వినటి ఆర్గానిక్స్ 4.67 శాతం, ఎస్ఆర్ఎఫ్ లిమిటెడ్ 3.76 శాతం అధికమయ్యాయి.
దేశీయ ఈక్విటీ మదుపరులు ఎగిరి గంతేశారు. గత కొన్ని రోజులుగా నష్టాలతో కాలంవెళ్లదీసిన పెట్టుబడిదారులు ట్రేడ్ డీల్‌తో ఒక్కసారిగా మారిపోయింది. ఈక్విటీలు ఆకాశమే హద్దుగా దూసుకుపోవడంతో వీటి సంపద కూడా లక్షల కోట్లు ఎగబాకింది. భారత్-అమెరికా ట్రేడ్ డీల్ ఓకే కావడంతో వీరి సంపద ఏకంగా రూ.12 లక్షల కోట్లకు పైగా పెరిగింది. మంగళవారం బీఎస్ఈలో లిైస్టెన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.12,10,877.45 కోట్లు పెరిగి రూ.4, 67,14,754.77 కోట్లకు చేరుకున్నది. డాలర్ల రూపంలో 5.16 ట్రిలియన్ డాల ర్లు. ఇటీవల కాలంలో ఒకేరోజు ఇంతటి స్థాయి ఎగబాకడం ఇదే తొలిసారి కావడం విశేషం.
81,666.46 ప్రారంభం
85,323.20 గరిష్ఠం
85,871.73 కనిష్ఠం
83,501.22 ముగింపు
83,739.13