CM KCR | నాగ్‌పూర్ : దేశమంతా తెలంగాణ మోడల్ అమలయ్యే వరకు పోరాడుతూనే ఉంటానని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పునరుద్ఘాటించారు. దేశంలోని ప్రతి గ్రామానికి, ప్రతి గల్లీకి వెళ్లి తెలంగాణ పథకాలు వివరిస్తాం అని స్పష్టం చేశారు. భారతదేశంలో మార్పునకు మహారాష్ట్ర నుంచే నాంది పలకాలని పిలుపునిచ్చారు. మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో బీఆర్ఎస్ పార్టీని ప్రారంభించిన సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
రైతులు బలహీనులు కాదు.. దేశాన్ని నడుపుతున్న బలమైన శక్తులు అని కేసీఆర్ ప్రశంసించారు. రైతులను అవమానించే వారికి తగిన శాస్తి తప్పదని హెచ్చరించారు. దేశానికి అన్నం పెట్టే రైతు పార్లమెంట్లో చట్టాలు చేయలేడా? అని ప్రశ్నించారు. దేశంలో 48 శాతం మంది రైతులే ఉన్నారు. వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తే 60 శాతం మందికి ఉపాధి లభిస్తుంది. సరిపడా సాగునీరు, విద్యుత్ ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యం కావాలన్నారు. మహారాష్ట్ర బడ్జెట్ రూ. 10 లక్షల కోట్లకు చేరాలి. మధ్యప్రదేశ్‌లో కూడా బీఆర్ఎస్ రావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారని కేసీఆర్ తెలిపారు.
రెవెన్యూ వ్యవస్థలోని అవినీతిని పారద్రోలాలా.. వద్దా..? అని కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థను డిజిటలైజ్ చేసి అవినీతికి అడ్డుకట్ట వేశాం. తెలంగాణలో పండిన పంటంతా ప్రభుత్వమే కొంటోంది. పంట సొమ్ము నేరుగా రైతుల ఖాతాల్లో వేస్తున్నాం. ఉచిత విద్యుత్, ఉచిత నీరుతో తెలంగాణలో సాగును పండుగలా మార్చాం. ఇప్పుడు తెలంగాణ వరి ఉత్పత్తిలో పంజాబ్‌ను దాటేసింది. అంతేకాకుండా రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు అమలు చేసి రైతులకు, వారి కుటుంబాలకు అండగా ఉంటున్నామని కేసీఆర్ వివరించారు.
తెలంగాణలో ప్రతి ఇంటికీ నల్లా ద్వారా తాగునీరు అందిస్తున్నాం అని కేసీఆర్ తెలిపారు. తాగునీటి కోసం బిందెలు పట్టుకుని తిరిగే పరిస్థితి తెలంగాణలో ఎక్కడా లేదు. తెలంగాణ లాంటి చిన్న రాష్ట్రమే ఇన్ని సాధిస్తే.. మహారాష్ట్ర ఎందుకు సాధించదు..? తెలంగాణలా చేస్తే మహారాష్ట్ర దివాలా తీస్తుందని కొందరు మరాఠా నేతలు అంటున్నారు. తెలంగాణ తరహాలో చేస్తే మరాఠా నేతలు దివాలా తీస్తారు.. ప్రజలు దీపావళి జరుపుకుంటారు. రైతులు తలచుకుంటే ఏదైనా చేయగలరు. ఎలాంటి మార్పునైనా సాధించగలరు అని కేసీఆర్ పేర్కొన్నారు. మహారాష్ట్రలో తెలంగాణ నమూనా పాలన వచ్చే వరకు బీఆర్ఎస్ పోరాడుతుంది. మహారాష్ట్రలో అనేక మంది నేతలు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. మహారాష్ట్రలో త్వరలోనే పరివర్తన వస్తుంది.. అది దేశమంతా పాకుతుంది. నాగ్‌పూర్‌లో ఆఫీసు ప్రారంభించుకున్నాం. ఔరంగాబాద్, పుణెలోనూ త్వరలో పార్టీ ఆఫీసులను ప్రారంభిస్తాం అని కేసీఆర్ తెలిపారు.