Hyderabad | పుణె: వాతావరణ మార్పులతో భవిష్యత్తులో కొన్ని నగరాలు నివాసయోగ్యంగా పనికిరాకుండా పోతాయని, సకాలంలో దీనిపై చర్యలు తీసుకోకపోతే ఆ నగరాల నుంచి హైదరాబాద్, బెంగళూరు, పుణె వంటి నగరాలకు భారీగా వలసలు ఉంటాయని టెక్ దిగ్గజం, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అభిప్రాయం వ్యక్తం చేశారు. శుక్రవారం మహారాష్ట్రలోని పుణె నగరంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ భారత్, ఆఫ్రికా వంటి కొన్ని దేశాలలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని చెప్పారు.
రానున్న రెండు దశాబ్దాలలో దేశంలోని కొన్ని ప్రదేశాలు నివాసయోగ్యంగా పనికిరాకుండా పోయే అవకాశం ఉందని, దీని ఫలితంగా భారీ వలసలు తప్పవని ఆయన అంచనా వేశారు. అయితే ట్రాఫిక్ సమస్యలు, వాతావరణ కాలుష్యం వంటి కారణాల వల్ల హైదరాబాద్, బెంగళూరు, పుణె వంటి నగరాలలో కూడా జీవించడం అంత సులభం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
ముఖ్యంగా కార్పొరేట్ రంగం రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లతో సమన్వయం చేసుకుని భారీ వలసలు జరగకుండా చర్యలు తీసుకోవలసి ఉంటుందని ఆయన సూచించారు. సమిష్టిగా పనిచేయడం వల్ల ఈ సమస్యను అధిగమించవచ్చని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కార్పొరేట్ ప్రపంచం, రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లు కలసికట్టుగా వాతావరణ మార్పు సమస్యను పరిష్కరించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
భారతీయులకు అన్ని విషయాలలో చివరి నమిషంలో మేల్కొనే అలవాటు ఉన్నందున 2030లో జరిగే వాతావరణ మార్పు గురించి ఇప్పట్లో అప్రమత్తమయ్యే అవకాశం ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. తన వివాదాస్పద సలహాలు, ప్రకటనలతో నారాయణమూర్తి తరచు వార్తలలోకి ఎక్కుతుంటారు. వారానికి 70 గంటల పనిపై ఆయన చేసిన ప్రకటనను టెకీలేకాక కార్పొరేట్ పరిశ్రమ నిపుణులు సైతం స్వాగతించలేదు.