Arsenic | న్యూఢిల్లీ : వాతావరణ మార్పుల వల్ల బియ్యంలో ఆర్సెనిక్ స్థాయిలు పెరుగుతున్నాయని, క్యాన్సర్‌కు ప్రధాన కారకాల్లో ఆర్సెనిక్ ఒకటి అని శాస్త్రవేత్తలు తెలిపారు. 2050 నాటికి ప్రపంచంలో ప్రతి ఐదుగురిలో ఒకరు తమ జీవితంలో ఏదో ఒక దశలో క్యాన్సర్ బాధితులవుతారని చెప్పారు. ఈ అధ్యయన నివేదిక లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ జర్నల్‌లో ప్రచురితమైంది. ప్రపంచ ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెల్సియస్ పెరిగితే, నేల నిర్మాణంలో మార్పులు వస్తాయని, కార్బన్ డయాక్సైడ్ స్థాయులు పెరుగుతాయని ఈ అధ్యయనం తెలిపింది. ఈ పరిస్థితుల్లో వరి మొక్కలు ఆర్సెనిక్‌ను పీల్చుకునే శక్తి పెరుగుతుందని వివరించింది.
ప్రపంచవ్యాప్తంగా ఏటా 54 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండుతాయి. దీనిలో 27 శాతం భారత దేశంలో పండుతుంది. ఆర్సెనిక్ స్థాయిలు పెరగడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. కొలంబియా విశ్వవిద్యాలయం, ఎన్విరాన్మెంటల్ హెల్త్ ప్రొఫెసర్ లూయిస్ జిస్కా మాట్లాడుతూ, ఆసియాలో, ముఖ్యంగా ఆగ్నేయాసియాలో, వరి పండించే ప్రాంతాల్లో కాలుష్య కారకంగా ఆర్సెనిక్ అందరికీ సుపరిచితమేనని చెప్పారు. వాతావరణ మార్పులు ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయన్నారు. ఫలితంగా క్యాన్సర్, గుండె జబ్బులు వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలిపారు.
కలుషిత మట్టి, సాగునీటిలో ఆర్సెనిక్ ప్రధానంగా కనిపిస్తుంది. కార్బన్డయాక్సైడ్ స్థాయిలు పెరిగితే, వరి మొక్కల నిర్మాణం మారుతుంది. ఆర్సెనిక్‌ను పీల్చుకునే శక్తి వాటికి పెరుగుతుంది. ఆర్సెనిక్తో కలుషితమైన నీటిని అన్నం వండటానికి ఉపయోగించడం వల్ల ముప్పు మరింత తీవ్రమవుతుంది. 2050 నాటికి ఆసియా దేశాల్లో లక్షలాది మంది ఊపిరితిత్తులు, ప్రొస్టేట్ క్యాన్సర్ వంటి క్యాన్సర్లతో బాధపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదే సమయానికి చైనాలో 1.34 కోట్ల ఆర్సెనిక్ సంబంధిత క్యాన్సర్ కేసులు నమోదుకావచ్చు. అంతేకాకుండా, గుండె జబ్బులు, మధుమేహం కూడా పెరగవచ్చు.