Assam : అసోంలోని కోక్రాఝార్ జిల్లాలో రెండు తెగల మధ్య మంగళవారం ఘర్షణ తలెత్తింది. బోడో, ఆదివాసి తెగల మధ్య ఘర్షణ హింసకు దారితీసింది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ ప్రాంతంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్) సిబ్బందిని మోహరించింది. హింస ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా కోక్రాఝార్ తోపాటు చిరాంగ్ జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేసింది. తదుపరి ఆదేశాలిచ్చేవరకు ఈ సేవలు అందుబాటులో ఉండబోవని ప్రభుత్వం పేర్కొంది.
పోలీసుల కథనం ప్రకారం.. కరిగాం ఔట్ పోస్ట్ పరిధిలో సోమవారం రాత్రి బోడో తెగకు చెందిన ముగ్గురు వ్యక్తులు వెళ్తున్న వాహనం ఇద్దరు ఆదివాసీలను ఢీకొంది. దీంతో అక్కడి ఆదివాసీ తెగవారు ఆగ్రహంతో నిందితులపై దాడి చేశారు. వాహనాన్ని తగలబెట్టారు. ఈ ఘటనలో ఒక వ్యక్తి మరణించాడు. దీంతో బోడో తెగకు చెందిన వారు కూడా ఆగ్రహంతో ప్రతి దాడి చేశారు. ఇది ఇరువర్గాల ఘర్షణగా మారింది. పరస్పరం దాడులు చేసుకున్నారు. రహదారుల్ని దిగ్భందించారు. టైర్లు తగలబెట్టారు. కొన్ని ఇండ్లు, ప్రభుత్వ ఆఫీసుల్ని కూడా దహనం చేశారు. కరిగాం ఔట్ పోస్టుపై కూడా దాడి చేసి, ధ్వంసం చేశారు. సోమవారం రాత్రి నుంచి ఇదే పరిస్థితి ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఘర్షణల్ని నివారించేందుకు ప్రభుత్వం ఆర్ఏఎఫ్ ను రంగంలోకి దించింది. ఆందోళనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. లాఠీ చార్జి చేశారు. ఇదే సమయంలో వారు భద్రతా దళాలపై కూడా ప్రతిదాడి చేశారు.
ఈ ఘటనల్లో కొందరు పోలీసులతోపాటు, ప్రజలు కూడా గాయపడ్డారు. పరిస్థితిని సమీక్షించేందుకు డీజీపీ హర్మీత్ సింగ్ తోపాటు, సీనియర్ పోలీస్ అధికారులు ఈ ప్రాంతానికి చేరుకున్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రయత్నిస్తున్నారు. ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. తప్పుడు సమాచారం ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు ఈ పరిస్తితిపై రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కూడా స్పందించారు. ప్రభుత్వం ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందన్నారు. అవసరమైతే ఆర్మీని కూడా రంగంలోకి దించుతామని చెప్పారు.