పాట్నా, జనవరి 3: న్యాయవ్యవస్థలోని ‘సహానుభూతి’ న్యాయమైన సమాజాన్ని అన్యాయమైన సమాజం నుంచి వేరు చేస్తుందని, అత్యంత అవసరమైన సమాజాల వైపు న్యాయ ధోరణిని మలచాల్సిన అవసరం ఉందని భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నొక్కి చెప్పారు. శనివారం పాట్నాలోని చాణక్య నేషనల్ లా యూనివర్సిటీ స్నాతకోత్సవ వేడుకల్లో ఆయన ప్రసంగించారు. ‘చాలా మంది యువ న్యాయవాదులు విజయం సాధించడానికి పనికి, మార్గదర్శకాలకు, అంచనాలకు పూర్తిగా లొంగిపోవాలని నమ్ముతారు. కొంతకాలం పాటు తీవ్రమైన కృషి అనివార్యమే.
కానీ అది మిమ్మల్ని మీరు కోల్పోయేలా మారకూడదు. చట్టం మీ జీవితంలో ప్రతి మూలనూ ఆక్రమిస్తే న్యాయానికి అవసరమైన సానుభూతి, విచక్షణను కోల్పోయే ప్రమాదం ఉంది’ అని సీజేఐ అన్నారు. ‘ఈ విశ్వవిద్యాలయం నుంచి బయటకు వెళ్లేటప్పుడు చట్టం కేవలం ఆర్థిక స్థోమత ఉన్న వారికే కాదు దాని అవసరం ఉన్న ఎవరికైనా ఉందని గుర్తుంచుకోండి. మీ నైపుణ్యాలను, ప్రజల ప్రయోజనాల కోసం ఉపయోగించడం మీ బాధ్యత. నేను తరచూ చెప్పినట్టుగా మీరు చట్టాన్ని నేర్చుకున్నారా లేదా అన్నది ప్రశ్న కాదు. దానిని తిరిగి రూపొందించడానికి, అది అత్యంత అవసరమైన సమాజాల వైపు న్యాయ ధోరణిని మలచడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అనేదే’ అని ఆయన అన్నారు.
న్యాయస్థానంలో ఉన్న ప్రతి కేసుకు పూర్తి విచారణ అవసరం లేదని, చాలా కేసులు మధ్యవర్తిత్వం, ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పరిష్కారమవుతాయని సీజేఐ సూర్యకాంత్ అన్నారు. ఇటీవల చండీగఢ్‌కు వచ్చిన ఆయన మధ్యవర్తిత్వం, కేసు వర్గీకరణ ద్వారా పెండెన్సీని తగ్గించడం, డిజిటల్ సాధనాలను జాగ్రత్తగా అమలు చేయడం వంటి అంశాలపై మాట్లాడారు. న్యాయం భవిష్యత్తు సాధ్యమైన చోట చర్చల పరిష్కారంలో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మధ్యవర్తిత్వం వల్ల సమయం, ఖర్చు తగ్గించడమే కాక బంధాలను పెంచుతుందన్నారు. న్యాయం కేవలం మాటల్లో సిద్ధాంతంగా కాకుండా వాస్తవంగా అమల్లో ఉండాలని, అది అవసరమైన వారికి నేలపై ఉండి పనిచేయాలని ఆయన తెలిపారు.