న్యూఢిల్లీ, జనవరి 24: ‘న్యాయం ఆలస్యమైతే అది న్యాయ నిరాకరణే కాదు.. న్యాయాన్ని నాశనం చేయడం కూడా’ అని సీజేఐ సూర్యకాంత్ అన్నారు. న్యాయవ్యవస్థలో సంస్థాగత లోపాల పట్ల హైకోర్టులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. హైకోర్టులు మరింత చురుగ్గా ఉండాలని, చట్ట పాలనలో వ్యవస్థాగత వైఫల్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. హైకోర్టులు కేవలం రివిజనల్, అప్పీలేట్ కోర్టులుగానే ఉండిపోకుండా, రాజ్యాంగ పరిష్కారానికి శక్తివంతమైన, అందుబాటులో ఉన్న కేంద్రాలుగా ఉండాలని సూచించారు.
న్యాయ వ్యవస్థలు మధ్యవర్తిత్వం, సయోధ్య లాంటి అంశాలను కూడా ప్రోత్సహించాలని సూచించారు. శనివారం ఫాలి నారిమన్ మెమోరియల్, బాంబే హైకోర్టులో జరిగిన ఆవిష్కరణ కార్యక్రమాలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘హైకోర్టులు మరింత చురుగ్గా ఉండాలి. చట్ట పాలనలో వ్యవస్థాగత వైఫల్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. దాని తలుపులు తట్టే వరకు వేచి ఉండకూడదు’ అని అన్నారు. ‘న్యాయం పొందే అవకాశాన్ని నిష్క్రియాత్మక హక్కు నుంచి రాష్ట్ర హామీ ఉన్న సేవగా మార్చడమే లక్ష్యం కావాలి.
న్యాయం ఆలస్యం కావడం అంటే న్యాయం నిరాకరించడమే కాదు, అది న్యాయాన్ని నాశనం చేయడమే’ అని ఆయన అన్నారు. అలాగే కోర్టు ఆవల వివాద పరిష్కార వ్యవస్థను పటిష్ఠం చేయాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. న్యాయం భవిష్యత్తు.. మనం వివాదాలను ఎంత సమర్థ్ధవంతంగా పరిష్కరించాం అనే దానిపై మాత్రమే కాకుండా ఎంత తెలివిగా పరిష్కరిస్తాం అనే దానిపై కూడా ఆధారపడి ఉంటుందన్నారు.