CJI Surya Kant : కొందరిని తాను పరాన్నజీవులుగా (Parasites) లేదా బొద్దింకలుగా పోల్చిన వివాదంపై భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) సూర్యకాంత్ (Suryakant) స్పందించారు. ఒక కేసు విచారణ సందర్భంగా తాను మౌఖికంగా చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పారు. నకిలీ సర్టిఫికెట్లు, బోగస్ డిగ్రీలతో మీడియాలోకి, న్యాయవ్యవస్థలోకి, ఇతర వృత్తుల్లోకి ప్రవేశించేవారిని ఉద్దేశిస్తూ తాను ఈ వ్యాఖ్యలు చేశానని అన్నారు. అలాంటి వారే మీడియా (Media), సోషల్ మీడియా (Social Media) తోపాటు ఇతర రంగాల్లోకి చొరబడ్డారని అన్నానని చెప్పారు. అలాంటి వారినే తాను పరాన్నజీవులుగా పేర్కొన్నట్లు తెలిపారు.
కానీ మీడియాలో కొందరు తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆవేదన సీజేఐ ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. భారతీయ యువతపట్ల తాను ఎంతో గర్వపడుతున్నానని పేర్కొన్నారు. శుక్రవారం ఓ కేసు విచారణ సందర్భంగా మౌఖికంగా చేసిన వ్యాఖ్యలను మీడియాలోని ఒక వర్గం వక్రీకరించిన తీరును చదివి తాను ఆవేదన చెందానని చెప్పారు. మన దేశ యువతను విమర్శించానని చెప్పడం పూర్తిగా నిరాధారమని అన్నారు. మన దేశ యువతను చూసి తాను ఎంతో గర్వపడుతున్నానని పేర్కొన్నారు. తనపట్ల భారత యువతకు గౌరవ మర్యాదలు ఉన్నాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని అన్నారు. యువతను దేశాభివృద్దికి మూలస్తంభాలుగానే చూస్తానని సూర్యకాంత్ తెలిపారు.