న్యూఢిల్లీ, ఏప్రిల్ 3 : న్యాయ వ్యవస్థలో పారదర్శకతను పెంపొందించే లక్ష్యంతో తమ ఆస్తులను బహిర్గతం చేయడానికి సుప్రీంకోర్టుకు చెందిన 30 మంది సిట్టింగ్ న్యాయమూర్తులు అంగీకరించారు. తమ ఆస్తులను సుప్రీంకోర్టు అధికారిక వెబ్సైట్లో ప్రచురించేందుకు ప్రధాన న్యాయమూర్తితోసహా న్యాయమూర్తులందరూ ఆమోదం తెలిపారు. ఈ నెల 1న జరిగిన ఫుల్ కోర్టులో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది భవిష్యత్తు న్యాయమూర్తులకు కూడా వర్తిస్తుంది. గత సంప్రదాయాలకు పూర్తి భిన్నంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక ప్రతి సంవత్సరం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తమ ఆస్తుల వివరాలను వెల్లడించాల్సి ఉంటుంది. గతంలో న్యాయమూర్తులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)కి తమ ఆస్తుల వివరాలు అందచేసేవారు. అది కూడా తప్పనిసరి కాదు. న్యాయమూర్తులు స్వచ్ఛందంగా తమ ఆస్తులను బహిర్గతం చేసేవారు. కాగా, తాజా నిర్ణయానికి సంబంధించిన తీర్మానం ఇంకా కోర్టు వెబ్సైట్లో అప్లోడ్ కాలేదు. ఇటీవల ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో మంటలు చెలరేగి కాలిపోయిన కరెన్సీ కట్టలు కనిపించటం తీవ్ర కలకలం రేపింది.