CJI DY Chandrachud | సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. కోర్టు కేసులతో ప్రజలు విసిగిపోయారని.. దాంతో సత్వర పరిష్కారాలు కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు 75వ వార్షికోత్సవం సందర్భంగా వారం రోజుల పాటు ప్రత్యేక అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. చివరిరోజైన శనివారం జరిగిన కార్యక్రమంలో సీజేఐ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అదాలత్ ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. తరుచూ కోర్టుల చుట్టూ తిరుగుతూ ప్రజలు విసిగిపోయారని.. దాంతో ప్రత్యామ్నాయ వివాద పరిష్కార యంత్రాంగమైన లోక్ అదాలత్లకు ప్రత్యేక పెరుగుతుందన్నారు. కోర్టులో పిటిషన్లు వేసే వారికి న్యాయ ప్రక్రియ ఒక శిక్ష లాంటిదని చీఫ్ జస్టిస్ అభిప్రాయపడ్డారు. దాంతో విసుగు కలించే కేసులను ముగించేందుకు పరిష్కారం కోసం చూస్తారన్నారు. ఈ సందర్భంగా అదాలత్‌లో పరిష్కారమైన పలు కేసులను ఆయన ఉదాహారణగా చూపించారు.
బలమైన పార్టీ అయినప్పటికీ తక్కువ పరిహారంతో కేసును సెటిల్ చేసేందుకు అంగీకరించిన ఓ వాహన ప్రమాదానికి సంబంధించిన కేసును ఈ సందర్భంగా ప్రస్తావించారు. కఠినమైన కోర్టు ప్రక్రియ నుంచి బయటపడాల్సి ఉన్నందున ప్రజలు ఎలాంటి పరిష్కారాన్నైనా అంగీకరించే సందర్భాలు చాలానే ఉన్నాయన్నారు. లోక్ అదాలత్‌ల ద్వారా న్యాయం అందించే ప్రక్రియను వ్యవస్థీకృతం చేయాల్సిన అవసరాన్ని చీఫ్ జస్టిస్ నొక్కి చెప్పారు. లోక్‌అదాలత్‌లో న్యాయవాదులను భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతో ఇద్దరు బార్ సభ్యులతో పాటు ఇద్దరు న్యాయవాదులతో ధర్మాసనం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజల వద్దకే న్యాయం వెళ్లాలనే ముఖ్య ఉద్దేశమని.. అదే సమయంలో కేసులను తగ్గించడం సైతం లక్ష్యమని వివరించారు. కార్యక్రమానికి కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ కూడా హాజరయ్యారు. భారతీయ సంస్కృతిలో మధ్యవర్తిత్వం ఎప్పటికీ భాగమేననన్నారు. మహాభారతంలో కౌరవులకు, పాండవులకు మధ్యవర్తిత్వం వహించేందుకు శ్రీకృష్ణుడు ప్రయత్నించాడని కేంద్రమంత్రి తెలిపారు.