న్యూఢిల్లీ, ఆగస్టు 24: దేశంలో కొన్ని రాష్ర్టాల్లో అమలవుతున్న ‘బుల్డోజర్ న్యాయం’పై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ బీఆర్ గవాయ్ నిశితంగా విమర్శించారు. ఇది రాజ్యాంగం నిర్దేశించిన అధికారాల పరిధిని తుంగలోకి తొక్కడమేనని అన్నారు. న్యాయ పాలనాధికారాన్ని కూడా తానే నిర్వహిస్తూ కార్యనిర్వహక వ్యవస్థ వ్యవహరిస్తున్నందున న్యాయస్థానం జోక్యం తప్పనిసరైందని పేర్కొన్నారు. నేరాలకు పాల్పడిన వారి ఇళ్లను ఏకపక్షంగా బుల్డోజ్ చేసిన అనేక జిల్లా పరిపాలనా చర్యలు చట్టపాలన, రాజ్యాంగబద్ధమైన అధికారాల విభజన భావం మూలాన్ని దెబ్బతీశాయని ఆయన అన్నారు.
గోవా హైకోర్టు బార్ అసోసియేషన్ నిర్వహించిన కార్యక్రమంలో శనివారం ఆయన మాట్లాడుతూ కార్యనిర్వాహక వర్గం తనకు తానుగా న్యాయమూర్తి అధికారాలతో వ్యవహరిస్తున్నందున కోర్టు జోక్యం చేసుకోవడం బాధ్యత అని అన్నారు. మన రాజ్యాంగం కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థ, చట్టసభల అధికారాలను వేర్వేరుగా నిర్వచించిందని, అలాంటప్పుడు కార్యనిర్వాహక వర్గం స్వయంగా న్యాయమూర్తిగా ఉండటానికి అధికారం ఉంటే, అప్పుడు మనం అధికారాల విభజన అనే భావననే దెబ్బతీసినట్టవుతుందని గవాయ్ అన్నారు. కేవలం కొన్ని ఆరోపణలే ఉన్న, విచారణ జరగని కొందరి వ్యక్తుల ఇళ్లను కూల్చివేయడం న్యాయ వ్యవస్థకు ఆందోళన కలిగించిందన్నారు. ‘చట్టబద్ధమైన ప్రక్రియను పాటించకుండా కొందరు ఇళ్లను కూల్చివేస్తున్నారు.
ఆ ఇంటిలో కేవలం నిందితులు మాత్రమే ఉండరు. ఇంట్లో నివసించే కుటుంబ సభ్యులు కూడా ఉంటున్నారు. ఈ చర్యతో వారి తప్పు లేకుండానే బాధలు అనుభవించాల్సి వస్తున్నది. ఒక వ్యక్తిని దోషిగా నిర్ధారించినప్పటికీ అతనికి న్యాయపరమైన హక్కులు లభిస్తాయి. మన దేశంలో న్యాయపరమైన హక్కులు అత్యంత ముఖ్యమైనవి’ అని గవాయ్ పేర్కొన్నారు. కాగా, యూపీలోని బుల్డోజర్ చర్యలను నిలిపివేస్తూ బీఆర్ గవాయ్, కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం 2024 నవంబర్లో ఆదేశాలు జారీ చేసింది. అధికారులు న్యాయ నిర్ణేతలు కాకూడదు అంటూ పేర్కొం ది. కార్యనిర్వాహక విభాగం న్యాయమూర్తిగా వ్యవహరించ లేదని, న్యాయ వ్యవస్థను అధిగమించ లేదని నొక్కి చెప్పింది. చట్టపరమైన ప్రక్రియ నిందితుడి నేరాన్ని ముందస్తుగా నిర్ధారించకూడదని ఆ కేసులో స్పష్టం చేసింది.
షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ల ఉప వర్గీకరణపై తాను తీర్పును ఇవ్వడానికి గల కారణాలను గవాయ్ గుర్తుకు తెచ్చుకున్నారు. ఈ తీర్పుపై తన సొంత సమాజానికి చెందిన వ్యక్తుల నుంచి తీవ్రంగా విమర్శలు వచ్చాయన్నారు. తన తీర్పును ప్రజల డిమాండ్లు, ప్రజల కోరికల ప్రకారం కాకుండా తాను అర్థం చేసుకున్న చట్టం, తన మనస్సాక్షి ప్రకారం రాయాలన్న విషయం ఎప్పుడూ నమ్ముతానని ఆయన అన్నారు. ముంబై లేదా ఢిల్లీలోని అత్యుత్తమ పాఠశాలల్లో విద్యనభ్యసించే సంపన్నుడైన వ్యక్తి కొడుకు లేదా కూతురు..
ఒక మారుమూల గ్రామంలో నివసిస్తూ జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీ పాఠశాలలో విద్యనభ్యసించే మేస్త్రి, లేదా వ్యవసాయ కూలీ కొడుకు లేదా కూతురుతో సమానమా? అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. దీంతో ఈ తీర్పుపై తన సొంత సమాజం సభ్యులే తనను విమర్శించారని ఆయన తెలిపారు. దేశానికి, సమాజానికి సేవ చేసేందుకు విధి ఇచ్చిన అవకాశంగా తాను ఎల్లప్పుడూ చూస్తానని, పదవి ఆనందం కోసం కాదు, రాజ్యాంగంలో నిర్దేశించిన విధంగా విధులను నిర్వహించడానికి, ప్రజాశ్రేయస్సుకు పాటుపడటానికి అని తాను భావించినట్టు జస్టిస్ గవాయ్ తెలిపారు.