న్యూఢిల్లీ: ప్రధాని మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం మరోసారి అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహాన్ని చవిచూసింది. ట్రిబ్యునల్ సంస్కరణల చట్టం-2021 రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణను వాయిదా వేయాలంటూ కేంద్రం చేసిన అభ్యర్థనపై సుప్రీంకోర్టు గురువారం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. న్యాయస్థానం పట్ల ఇలా వ్యవహరించడం అనుచితమని సీజేఐ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రంపై అసహనం వ్యక్తం చేసింది.
ఈ పిటిషన్లపై విచారణను ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనానికి నివేదించాలని కోరుతూ గత సోమవారం కేంద్రం చేసిన విజ్ఞప్తిపై ఇదే ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ తుది దశకు చేరుకున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇటువంటి అభ్యర్థనను తాము ఊహించలేదని సీజేఐ వ్యాఖ్యానించారు. కేంద్రం అభ్యర్థనను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించిన సీజేఐ.. ఈ ధర్మాసనం నుంచి తప్పించుకునేందుకే కేంద్రం ఇటువంటి ఎత్తుగడలు వేస్తోందని వ్యాఖ్యానించారు. అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి ద్వారా కేంద్రం ఈ అభ్యర్థన చేయగా ఇటువంటి ఎత్తుగడలను తాము అనుమతించబోమని సీజేఐ స్పష్టం చేశారు.