High Court | న్యూఢిల్లీ: ఢిల్లీలోని రావూస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ సెల్లార్లో వరద నీటిలో మునిగి ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు మృతిచెందిన కేసును ఢిల్లీ హైకోర్టు సీబీఐకి అప్పగించింది. ఈ కేసులో నీటి ప్రవాహం ఉద్ధృతికి కారణమయ్యాడంటూ ఎస్యూవీ డ్రైవర్‌ను అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులను తప్పుబట్టిన న్యాయస్థానం.. ‘ఇంకా నయం.. వాన నీటిలో కారు నడిపినందుకు ఎస్యూవీ డ్రైవర్‌ను అరెస్ట్ చేసినట్టుగానే బేస్మెంట్లోకి వచ్చినందుకు వాన నీటికి వారు చలాన్ విధించకుండా దయచూపారు’ అని వ్యాఖ్యానించింది. విద్యార్థులు ఈ ప్రమాదం నుంచి ఎందుకు బయటపడలేకపోయారో అర్థం కావడం లేదని పేర్కొంది.
రాజీంద్రనగర్ ప్రాంతంలో డ్రైనేజీలు సరిగ్గా పనిచేయడం లేదని ఎంసీడీ అధికారులు కమిషనర్‌కు ఎందుకు సమాచారం ఇవ్వలేదని న్యాయస్థానం ప్రశ్నించింది. నిర్దేశిత సమయంలో సీబీఐ విచారణ ముగిసేలా చూసేందుకు ఒక సీనియర్ అధికారిని నియమించాలని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీబీసీ)ని ఆదేశించింది. అన్ని అంశాల పరిశీలనకు న్యాయస్థానం ఒక కమిటీని నియమించింది. చీఫ్ సెక్రటరీ నేతృత్వంలోని ఈ కమిటీలో డీడీఏ ఉపాధ్యక్షుడు, ఢిల్లీ పోలీస్ కమిషనర్, ఎంసీడీ కమిషనర్ సభ్యులుగా ఉంటారు. ఎనిమిది వారాల్లో ఈ కమిటీ నివేదికను సమర్పిస్తుంది.