పాట్నా: కేంద్ర మంత్రి, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ (Chirag Paswan) ప్లేట్ ఫిరాయించారు. బీహార్‌లో (Bihar) నేరాలు పెరిగిపోయాయని, శాంతి భద్రతతలు క్షీనించాయని రెండు రోజుల క్రితం సీఎం నితీశ్ కుమార్ (Nitish Kumar) ప్రభుత్వంపై విరుచుకుపడిన ఆయన మాట మార్చారు. మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ప్రమాణస్వీకారం చేయడం ఖాయమని చెప్పారు. ప్రధాని మోదీ సారథ్యంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్త చేశారు. తమది గెలుపు కలయిక అని వెల్లడించారు. ఇప్పటికే చాలాసార్లు చెప్పాను.. ప్రధాని మోదీ నాయకత్వంలోనే బీహార్‌లో ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల ఫలితాల తర్వాత నితీశ్ కుమార్ మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారు. ఆయన కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. ఆపరేషన్ సిందూర్ విషయంలో ప్రధానిపై విమర్శలు చేస్తున్న విపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, ఈ నెల 26న పాట్నాలో మీడియాతో మాట్లాడిన చిరాజ్.. సీఎం నితీశ్ ప్రభుత్వం నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయన్నారు. నేరాలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. ఈ మేరకు అధికారంలోని నితీశ్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినందుకు చింతిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో నేరాలు, దోపిడీలు, అత్యాచారాలు, హత్యలు, కిడ్నాప్‌లు పెరిగిపోయాయన్నారు. రాష్ట్రంలో ప్రజలు సురక్షితంగా ఉండలేకపోతున్నారన్నారు. ప్రజలను రక్షించే స్థితిలో ప్రభుత్వం లేదని.. అలాంటి ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నందుకు చింతిస్తున్నట్లు ఈ సందర్భంగా పాశ్వాన్ వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం మేల్కొని నేరాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.