Chinese Ballon | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: అమెరికా గగనతలంలో ఇటీవల ఎగిరిన నిఘా బెలూన్లు కలకలం సృష్టించాయి. చైనా ప్రయోగించినట్టుగా భావించిన ఒక బెలూన్ను క్షిపణిని ప్రయోగించి అమెరికా పేల్చివేసింది. అయితే అటువంటిదే ఓ బెలూన్ గత ఏడాది జనవరిలో అండమాన్ దీవులపై కూడా ఎగిరిందని స్థానిక పత్రికలు వార్తా కథనాలను ప్రచురించాయి. దేశ రక్షణపరంగా ఎంతో వ్యూహాత్మకంగా భావించే అండమాన్ దీవులపైకి గుర్తు తెలియని ఒక భారీ బెలూన్ వచ్చి పోయినప్పటికీ భార త ప్రభుత్వం ఇంతవరకు స్పందించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
జాతీయవాదం నినాదంతో రెండుసార్లు అధికార పీఠమెక్కిన ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన పార్టీ నేతలు ఇప్పటివరకు ఆ బెలూన్ గురించి మాట్లాడకపోవడంపై సందేహాలు తలెత్తుతున్నాయి. అమెరికాను అధిగమించి ప్రపంచ ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్న చైనా గత కొన్నేండ్లు గా వ్యూహాత్మకంగా దూకుడును ప్రదర్శిస్తున్నది. గత నెలలో అమెరికా గగనతలంలోకి వచ్చిన బెలూన్లు చైనావేనని తేలింది. అత్యంత ఆధునిక పరిజ్ఞానంతో రూపొందిన ఈ బెలూన్లు నిఘా వ్యవస్థను కలిగి ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అణు క్షిపణులను దాచి ఉంచిన మోంటానా ప్రాంతంతోపాటు అమెరికా భూభాగంపై చాలా రోజులపాటు ఒక బెలూన్ తచ్చాడిం ది.
చివరికి ఆ బెలూన్పైకి అమెరికా ఓ క్షిపణిని ప్రయోగించి దానిని కూల్చివేసిన సంగతి తెలిసిందే. అయితే అది నిఘా బెలూన్ కాదని, వాతావరణ పరిస్థితులను అంచనా వేయడానికి ప్రయోగించామని చైనా బుకాయించింది. చైనాకు చెంది న హైనాన్ దీవి నుంచి దీనిని ప్రయోగించారని, అందులో నిఘా వ్యవస్థ ఉన్నదని అమెరికన్ ఇంటెలిజెన్స్ అధికారులు తేల్చి చెప్పారు. ఇటువంటి బెలూన్లు తమ గగనతలంలో కూడా కనిపించాయని తైవాన్, జపాన్ కూడా ఆరోపించా యి. 2021 సెప్టెంబర్‌లో, 2022 ఫిబ్రవరిలో తమ భూభూగంపైకి చైనా బెలూన్లు వచ్చాయని తైవాన్ విదేశాంగ శాఖ ఇటీవల వెల్లడించింది. బెలూన్ ఆకారంలో ఉన్న మూడు మానవ రహిత పరికరాలు తమ గగనతలంలో కూడా తిరిగాయ ని జపాన్ తెలిపింది. 2019 నవంబర్‌లో, తిరిగి 2021 సెప్టెంబర్‌లో అవి వచ్చాయని పేర్కొంది. కానీ భారత్ ఇంతవరకు నోరు మెదపలేదు.
మోదీ సర్కారు మౌనం..
భారత త్రివిధ దళాలు విన్యాసాలు నిర్వహించే అండమాన్ నికోబార్ దీవుల వద్ద గుర్తు తెలియని ఒక బెలూన్ గగనతలంలో కనిపించింది అని ఇండియా టుడే.. చైనాకు చెందిన నిఘా బెలూన్లు ఆయా దేశాల్లో కలకలం సృష్టిస్తున్నాయి, భారత్‌కు చింతలేదా? అని లైవ్ మింట్.. ‘చైనా బెలూన్ భారత్‌ను లక్ష్యంగా చేసుకొని వచ్చింది’ అని ది వైర్.. చైనాకు చెందిన గూఢచార బెలూన్ భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చిందా? అని ఫస్ట్‌పోస్ట్ పత్రికలు వార్తా కథనాలను ప్రచురించాయి. ఈ కథనాలపై ప్రభుత్వ పెద్దలు ఇంతవరకు స్పందించలేదు. దీనిపై ఢిల్లీలోని విధాన పరిశోధన కేంద్రం సీనియర్ సభ్యుడు సుశాంత్ సింగ్ స్పందిస్తూ.. ‘భారత ప్రభుత్వం ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నది గనుక మౌనంగా ఉన్నది. భారత సార్వభౌమాధికారానికి కంచుకోటగా భావిస్తున్న అండమాన్ దీవులపైకి ఒక గుర్తు తెలియని బెలూన్ వచ్చిందని అంగీకరిస్తే.. అంతర్జాతీయంగా మనం బలహీనంగా కనిపించే అవకాశం ఉంటుంది.
ముఖ్యంగా రెండు శిఖరాగ్ర సమావేశాలు (జీ20, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్)కు భారత్ ఆతిథ్యమివ్వనున్న సమయంలో అంతర్జాతీయంగా అందరి దృష్టి భారత్‌పై పడుతుంది. ఇక వచ్చే ఏడాది దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో.. ఓటర్ల దృష్టిలో పటిష్ఠమైన నేతగా కనిపించేందుకు మోదీ కృషి చేస్తారు. ఈ పరిస్థితుల్లో.. భారత సైన్యం మోహరించి ఉన్న వ్యూహాత్మక ప్రదేశంలో ఒక బెలూన్ కనిపించింది అని చెప్పటం ప్రభుత్వ బలహీనతను వ్యక్తపరుస్తుంది. జాతీయవాద ప్రభుత్వంగా చెప్పుకుంటున్న మోదీ సర్కార్ ప్రతిష్ఠను బెలూన్ అంశం పూర్తిగా ధ్వంసం చేస్తుంది కాబట్టి న్యూఢిల్లీ పెద్దలు దానిని లేవనెత్తేందుకు ఇష్టపడకపోవచ్చు’ అని అభిప్రాయపడ్డారు. మరోవైపు ఇప్పటినుంచి ఏడాదిన్నర కాలంలో దేశంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో చైనాతో దౌత్యపరమైన సంక్షోభాన్ని తెచ్చుకోవడం ప్రభుత్వానికి ప్రతికూలంగా మారవచ్చని అన్నారు.

దేశ రక్షణలో రాజీ..
గత 60 ఏండ్లుగా భారత్ విషయంలో చైనా దూకుడుగానే వ్యవహరిస్తున్నది. ఉభయ దేశాల మధ్యనున్న 3,380 కిలోమీటర్ల సరిహద్దు వెంట చైనా నిత్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉన్నది. ఈ చర్యలు 1960లో నెల రోజుల యుద్ధానికి దారి తీశాయి. మూడేండ్ల క్రితం ఉభయ దేశాల మధ్య జరిగిన ఘర్షణలో 20 భారతీయ సైనికులు, రెట్టింపు సంఖ్యలో చైనీయులు మరణించిన సంగతి తెలిసిందే. 2020 తరువాత సరిహద్దు వద్ద చైనా వైఖరి పూర్తిగా మారిపోయిందని లెఫ్టినెంట్ జనరల్ రాకేశ్ శర్మ చెప్పారు. కొన్ని ప్రాంతాలలో దురాక్రమణకు పాల్పడిన చైనా సైనికులు అక్కడి నుంచి వైదొలగేందుకు నిరాకరించారని తెలిపారు. గత డిసెంబర్లో కూడా ఇరు పక్షాల సైనికులు ఘర్షణ పడ్డారని ఏషియా పసిఫిక్ రిసెర్చ్ సెంటర్‌కు చెందిన అర్జున్ తారాపూర్ చెప్పారు. ఈ పరిణామ క్రమంలోనే భారత సైన్యం మోహరించి ఉన్న దీవులపైకి చైనా బెలూన్ వచ్చిందని అన్నారు. భవిష్యత్తులో ఇటువంటి కవ్వింపు చర్యలు మరింత పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం మౌనం వహించడం దేశ రక్షణ విషయంలో రాజీ పడటమేనని అన్నారు.
భారత్‌కు వ్యూహాత్మకం..
బంగాళాఖాతం, అండమాన్ సముద్రం జంక్షన్‌లోని ద్వీప సమూహంలో కొన్ని ఆదిమజాతి తెగలు నివసిస్తున్నాయి. ఐదువందలకుపైగా ఉన్న ఈ ద్వీపాలలో కేవలం 12 దీవులలో మాత్రమే జనావాసాలు ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత రద్దీ అయిన, వాణిజ్య సముద్ర మార్గం మలక్కా జలసంధి ఇక్కడికి సమీపంలోనే ఉన్నది. భారత త్రివిధ దళాలు నిత్యం ఇక్కడ విన్యాసాలు నిర్వహిస్తూ ఉంటాయి. ఈ ప్రాంతాన్ని ‘నీట ముంచలేని విమాన వాహక నౌక’గా సైన్యాధికారులు వర్ణిస్తుంటారు. ఒకవేళ చైనాతో అమెరికా యుద్ధానికి దిగితే.. భారత్‌ను ఈ దీవుల నుంచి మద్దతివ్వాలని అమెరికా కోరవచ్చు అని తక్షశిల ఇన్స్టిట్యూట్కు చెందిన మనోజ్ కేవల్మ్రణి అభిప్రాయపడ్డారు. ఈ దీవుల్లో ఎటువంటి కార్యకలాపాలు జరుగుతున్నాయో తెలుసుకొనేందుకు చైనా ప్రయత్నించి ఉండవచ్చన్నారు.