DeepSeek | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ) : కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో చైనా కంపెనీ డీప్‌సీక్ అభివృద్ధి చేసిన ఏఐ టూల్ ‘డీప్‌సీక్ ఆర్1’ పెను సంచలనాలను సృష్టిస్తున్నది. ఓపెన్ ఏఐకు చెందిన చాట్‌జీపీటీ, గూగుల్‌కు చెందిన జెమినీ, మైక్రోసాఫ్ట్ అభివృద్ధి చేసిన అజురా, కోపైలట్‌ను తోసిరాజని ‘డీప్‌సీక్’ కొత్త రికార్డులు సృష్టిస్తున్నది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం ‘డీప్‌సీక్ ఆర్1’ టూల్‌ని ఉద్దేశిస్తూ.. అమెరికన్ టెక్ కంపెనీలకు ఇదో మేల్కొలుపు అంటూ వ్యాఖ్యానించారంటే ఇది ఏ స్థాయిలో సంచలనాలను సృష్టిస్తున్నదో అర్థంచేసుకోవచ్చు.
‘డీప్‌సీక్ ఆర్1’ అనేది చాట్‌జీపీటీ లాంటి ఏఐ ఆధారిత చాట్‌బాట్. వినియోగదారులు అడిగే ప్రశ్నలకు కచ్చితమైన సమాధానాలు ఇవ్వడానికి సాయపడుతుంది. చాట్‌జీపీటీ లాగే ఆర్1 మోడల్‌పై ఇది పనిచేస్తుంది. అంటే 670 బిలియన్ పారామీటర్లు కలిగి ఉన్న అతిపెద్ద లాంగ్వేజ్, డాటాను ఇది నిక్షిప్తం చేసుకొని సేవలు అందిస్తుందన్న మాట. ఏ ప్రశ్న అడిగినప్పటికీ సమాధానమివ్వగల సామర్థ్యం దీని సొంతం.
చాట్‌జీపీటీ, గూగుల్ జెమినీ చాట్‌బాట్‌తో పోలిస్తే ప్రతీఒక్కరూ డీప్‌సీక్‌కు ఆకర్షితులు కావడానికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒకటి దీని తయారీకి ఖర్చయిన సొమ్ము మిగతా చాట్బాట్లపై చేసిన వ్యయంలో 50 రెట్లు తక్కువగా ఉన్నట్టు చెప్తున్నారు. డీప్‌సీక్ మోడల్‌కు శిక్షణ ఇచ్చేందుకు తక్కువ సామర్థ్యం కలిగిన ఎన్విడియా హెచ్ 800 చిప్‌లను వాడారు. దీంతో యాప్ తయారీ, సేవల వ్యయం భారీగా తగ్గిపోయింది. మిగతా చాట్బాట్లు యూజర్ల నుంచి సబ్స్క్రిప్షన్ల పేరిట కొంత రుసుమును వసూలు చేస్తుండగా ‘డీప్‌సీక్’ యాప్ ఫ్రీగా అందుబాటులోకి వచ్చింది. యాపిల్ యాప్ స్టోర్ నుంచి అతి తక్కువ కాలంలో అత్యధిక డౌన్లోడ్లు సాధించిన యాప్‌గా ‘డీప్‌సీక్’ నిలిచింది. చైనాకు చెందిన ఐటీ ఇంజినీర్ లియాంగ్ వెన్ఫెంగ్ ‘డీప్‌సీక్’ సంస్థకు వ్యవస్థాపకుడిగా ఉన్నారు.
డీప్‌సీక్‌పై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘డీప్‌సీక్ ఆవిష్కరించిన ఆర్1 మోడల్ ఆకట్టుకొంటున్నది. తక్కువ ధరకు ఈ సేవలు ఇవ్వడం విశేషం. త్వరలోనే మేమూ మెరుగైన మోడల్ తీసుకొస్తాం’ అని ఓపెన్ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మన్ అన్నారు. ‘డీప్‌సీక్’ ఓ మేల్కొలుపు అంటూ అమెరికన్ టెక్ కంపెనీలను ట్రంప్ సున్నితంగా హెచ్చరించారు. ‘డీప్‌సీక్’ పనితీరును ఎన్వీడియా సంస్థ కూడా ప్రశంసించింది.
‘డీప్‌సీక్’ చాట్బాట్లో చైనాకు వ్యతిరేకమైన విషయాలను అడిగితే సమాధానం రావట్లేదని నెటిజన్లు అంటున్నారు. ‘అరుణాచల్ భారత్‌లోని ఓ రాష్ట్రం’ అని టైప్ చేస్తే.. ‘ఇది నా పరిధి దాటిన అంశం. మరేదైనా చర్చిద్దాం’ అంటూ డీప్‌సీక్ సమాధానమిచ్చినట్టు ఓ యూజర్ అన్నారు. 1989 జూన్ 4న చైనాలోని తియాన్మెన్ స్కేర్‌లో జరిగిన ఊచకోతపై ప్రశ్నించగా.. ‘ఐయామ్ సారీ.. సమాధానం ఇవ్వలేను’ అని వచ్చినట్టు మరో నెటిజన్ పేర్కొన్నారు.
అడ్వాన్స్డ్ ఏఐకి ఖరీదైన చిప్స్, అలాగే భారీ పెట్టుబడులు అవసరం లేదని డీప్‌సీక్ యాప్ విజయమే చాటిచెబుతున్నదన్న వాదనలు పెరుగుతున్నాయి. అందుకే, ఖరీదైన చిప్ తయారీ దిగ్గజ సంస్థ ఎన్వీడియా సంస్థ సోమవారం ఒక్కరోజే రూ. 51 లక్షల కోట్లను నష్టపోయింది. కాగా ‘డీప్‌సీక్ ఆర్1’ తయారీకి రూ. 51 కోట్లు ఖర్చవ్వడం గమనార్హం.