న్యూఢిల్లీ, జనవరి 12: జమ్ము కశ్మీరులోని షక్స్‌గామ్ లోయ ప్రాంతాన్ని తన భూభాగంగా ప్రకటించుకున్న చైనా.. చైనా-పాకిస్థాన్ ఆర్థిక కారిడార్(సీపీఈసీ) ద్వారా పాకిస్థాన్‌కు ఆ ప్రాంతం మీదుగా రోడ్డు నిర్మాణాన్ని చేపట్టింది. చైనా చర్యను ఖండించిన భారత్ షక్స్‌గామ్ లోయ ప్రాంతంలో ఎటువంటి విదేశీ నిర్మాణం చేపట్టరాదని అనేక పర్యాయాలు స్పష్టంచేసింది.
ఆ ప్రాంతాన్ని చైనా తన నియంత్రణలోకి తీసుకోవడం చట్టవ్యతిరేక ఆక్రమణ అవుతుందని ఈనెల 9న భారత్ పునరుద్ఘాటించింది. షక్స్‌గామ్ ప్రాంతం తమ భూభాగమేనని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ సోమవారం విలేకరుల సమావేశంలో తెలిపినట్లు చైనా ప్రభుత్వ యాజమాన్యంలోని గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది.
తన సొంత భూభాగంలో మౌలిక సదుపాయాల నిర్మాణాన్ని చేపట్టే హక్కు చైనాకు ఉందని, దీన్ని ఎవరూ సవాలు చేయలేరని ఆమె తెలిపారు. 1948లో షక్స్‌గామ్ లోయను పాకిస్థాన్ ఆక్రమించుకుని 1963లో ఆ ప్రాంతాన్ని చైనాకు అప్పగించింది. కశ్మీరు వివాదాన్ని ప్రస్తావిస్తూ చైనా వైఖరిలో ఎటువంటి మార్పులేదని మావో నింగ్ తెలిపారు. 1960వ దశకంలో చైనా, పాకిస్థాన్ ఓ సరిహద్దు ఒప్పందాన్ని చేసుకున్నాయని, దాని కింద తమ చట్టపరమైన హక్కులను ఉపయోగించుకుని రెండు స్వతంత్ర దేశాలు తమ సరిహద్దులను ఏర్పర్చుకున్నాయని ఆమె చెప్పారు.