న్యూఢిల్లీ: భారతదేశ సరిహద్దు దగ్గర కొత్త వైమానిక రక్షణ స్థావరాన్ని చైనా నిర్మిస్తున్నది. 2020లో ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగిన ప్రాంతానికి సుమారు 110 కిలోమీటర్ల దూరంలో ఈ నిర్మాణాలు ఉన్నాయి. శాటిలైట్ చిత్రాల ద్వారా ఈ విషయం నిర్ధారణ అయ్యింది. (China builds new air defence site) టిబెట్‌లోని పాంగోంగ్ సరస్సు తూర్పు భాగం ఒడ్డున కొత్తగా వైమానిక రక్షణ స్థావరాన్ని చైనా నిర్మిస్తున్నది. కమాండ్ అండ్ కంట్రోల్ భవనాలు, బ్యారక్‌లు, రక్షణ వాహనాల కోసం షెడ్లు, మందుగుండు సామగ్రి నిల్వ ప్రాంతాలు, రాడార్ స్థావరాలతో ఇది కూడి ఉన్నది.
కాగా, వైమానిక రక్షణలో భాగంగా క్షిపణులు ప్రయోగించే ట్రాన్స్పోర్టర్ ఎరెక్టర్ లాంచర్ (టీఈఎల్) వాహనాల కోసం ముడుచుకునే పైకప్పులతో బంకర్లను చైనా నిర్మిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చైనాకు చెందిన దీర్ఘ శ్రేణి హెచ్‌క్యూ 9 సర్ఫేస్-టు-ఎయిర్ క్షిపణి వంటి వ్యవస్థలను దాచడం, వాటికి రక్షణ కల్పించడం కోసం ఈ కాంక్రీట్ షెల్టర్లను చైనా నిర్మించినట్లు నిఘా అధికారులు భావిస్తున్నారు.
మరోవైపు భారత సరిహద్దులో చైనా నిర్మిస్తున్న కొత్త వైమానిక రక్షణ స్థావరాన్ని అమెరికాకు చెందిన జియో ఇంటెలిజెన్స్ సంస్థ ఆల్సోర్స్ అనాలిసిస్ పరిశోధకులు తొలుత గుర్తించారు. అలాగే గార్ కౌంటీ వద్ద ఉన్న మరో కాంప్లెక్స్ నిర్మాణాన్ని కూడా పసిగట్టారు. ఎల్ఏసీకి సుమారు 65 కిలోమీటర్ల దూరంలో ఇది ఉన్నది. భారత్ ఇటీవల అప్‌గ్రేడ్ చేసిన న్యోమా ఎయిర్‌ఫీల్డ్‌కు ఎదురుగా కొత్త వైమానిక రక్షణ స్థావరాన్ని చైనా నిర్మించినట్లు శాటిలైట్ చిత్రాల ద్వారా వెలుగులోకి వచ్చింది.
Also Read:
Elephant Dies | విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన ఏనుగు.. విద్యుదాఘాతంతో మృతి
Man Stabbed To Death | దీపావళి గిఫ్ట్ కోసం యజమానితో వ్యక్తి గొడవ.. కత్తితో పొడిచి హత్య