Bihar | పాట్నా: బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో ఐదుగురు బాలలు యూట్యూబ్ చూసి బాంబు తయారు చేయడం నేర్చుకున్నారు. అగ్గిపుల్లల నుంచి గన్‌పౌడర్‌ను సేకరించి, ఓ టార్చిలైట్లో పోశారు. అనంతరం ఓ బ్యాటరీని అనుసంధానం చేసి, టార్చిలైట్‌ను స్విచాన్ చేశారు. దీంతో అది వెంటనే పేలింది. ఈ దుర్ఘటనలో ఓ బాలుడు తీవ్రంగా గాయపడగా, నలుగురు బాలలకు స్వల్ప గాయాలయ్యాయి. వీరందరికీ గయాఘాట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స చేయిస్తున్నారు..
సుప్రీంకోర్టులో నేడు సినిమా ప్రదర్శన
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ఇతర సిబ్బంది కుటుంబాల కోసం శుక్రవారం ‘లాపతా లేడీస్’ సినిమాను సుప్రీంకోర్టులో ప్రదర్శిస్తారు. స్త్రీ, పురుష సమానత్వాన్ని చాటి చెప్పే ఈ చిత్రాన్ని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ సహా ఇతర న్యాయమూర్తులు, రిజిస్ట్రీ అధికారులు, బాలీవుడ్ ప్రముఖులు అమీర్ ఖాన్, కిరణ్ రావు కూడా వీక్షిస్తారు.
కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎంలకు సమన్లు
బెంగళూరు, ఆగస్టు 8: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్‌లకు బెంగళూరు కోర్టు గురువారం సమన్లు జారీ చేసింది. ఈ నెల 29న వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. జూన్ 2022లో కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాకు సంబంధించిన కేసులో కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. రాహుల్ గాంధీని ఈడీ మాటిమాటికీ ప్రశ్నిస్తున్నదని.. ఇది అనవసరంగా వేధించడమేనని ఆరోపిస్తూ జరిగిన ఆనాటి ధర్నాలో సిద్ధరామయ్య, శివకుమార్ పాల్గొన్నారు. ఈ ధర్నాపై నిషేధం ఉన్నా కాంగ్రెస్ నాయకులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. దీని వల్ల ప్రజల శాంతికి భంగం కలిగిందన్న ఆరోపణలపై విల్సన్ గార్డెన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.